యువత పాలిట పెనుశాపంగా మారుతున్న  మితిమిరిన వేగం !!

యువత పాలిట పెనుశాపంగా మారుతున్న  మితిమిరిన వేగం !!

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- యువతకు వేగం ఆనందం ఇవ్వవచ్చునేమో గాని అది వారి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపివేస్తుంది!  ఈ మధ్య కాలం లో యువత బైక్ లపై మితిమీరిన వేగం తో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉడుకు రక్తం నరనరాన ఉప్పొంగే యువతలో తాము బైక్ ను నడపడం అనేది ఎంత ప్రమాదకరమో, ఒక్కొక్కసారి అది తమ ప్రాణాల మీదకు తెస్తుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా (‘speed thrills but kills’ ), అతివేగం అనర్థదాయకం వంటి బోర్డులను రాష్ట్రరవాణా శాఖ వారు ఎన్ని పెట్టిన వాటిని పెడచెవిన పెడుతూ యువత అత్యంత వాయు వేగం తో తమ మోటార్ బైక్ లను దౌడు తీయించడమే పనిగా పెట్టుకున్నారు. పైగా యువత ఓకే బైక్ పై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రయాణం చేస్తూ తమ ఇష్టం వచ్చిన రీతిలో బైక్ లలో కటింగులు కొడుతూ,సర్కస్ ఫీట్లు చేస్తూ అత్యంత వేగం తో ముందుకు దూసుకుపోతూ అటు వారి ప్రాణాలను ప్రమాదపు అంచుల్లోకి తీసుకుపోవడమే గాక ఇటు రోడ్డు మీద నడిచే పాదచారులను, వాహనాలపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదం లోకి నెట్టి వేస్తుండటం కడు శోచనీయం. పోలీసు శాఖ వారు ఎంతో నిఘా పెట్టి ఈ యువత వేగానికి చెక్ పెట్టేలా వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎన్ని తీసుకుంటున్న పరిస్థితిలో పెద్దగా మార్పు కాన రావడం లేదు. అదేవిధంగా యువత తల్లిదండ్రులు సైతం తమ వంతుగా బైక్ లపై వేగంగా వెళ్లడం వల్ల ఎన్నో అనర్థాలు వున్నాయి అని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికి అవి చెవిటోడి ముందు శంఖం ఉదినట్లు ఇలాంటి మాటలను సైతం భేఖాతార్ చేస్తూ యువత వేగంగా వెళ్లడమే తమ అభిమతం అనే మొండి వైఖరితో ముందుకు వెళుతూ అనేక ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనను, ఎనలేని గర్భ శోకాన్ని మిగుల్చుతున్నారు అనే మాట సత్య దూరం కాదు.ఏదిఏమైనా ఈ మితిమీరిన వేగం అనే విషనాగుకు, అత్యంత ఆనారోగ్యపు అలవాటుకు పాదాక్రాంతం, బానిస అవ్వడమే గాక, వేగంగా వెళ్లడం అనేది ఓక వెలంవెర్రిగా భావిస్తున్న యువత కోరి కోరి పులి బోనులో అడుగు పెట్టినట్లుగా వీరి జీవితాలను వీరే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏమైన ప్రతి ఏడాది దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఓక సందర్భం లో వేలాది మంది యువత ఈ అదుపు తప్పిన వేగం కారణంగా తమ విలువైన ప్రాణాలను మృత్యుకూపం లోకి నెట్టి వేసుకుంటుండటం అత్యంత దిగ్బ్రాంతికరం. ఇప్పటికైనా యువత తాము అంతకు తాముగా వివేకం తో వ్యవహరించి తమ వేగానికి ముకుతాడు వేయకపోతే, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ‘ నిదానమే ప్రదానం(go slowly reach safely) అనే పెద్దల నానుడికి కట్టుబడి యువత వ్యవహరిస్తే అది మీకు, ఈ సమాజానికి ఎంతో ఆరోగ్యకరం. కాబట్టి ‘ నేటి యువత రేపటి మన దేశ బంగారు భవిష్యత్ కు ఆశాకిరణాలు ‘ అనే అత్యంత ప్రధానమైన విషయాన్ని నేటి యువత ఎల్లవేళలా గుర్తు పెట్టుకొని మసలుకుంటూ మితిమీరిన వేగం అనే గుర్రానికి సంకెళ్లు వేయక తప్పదు. అలా చేస్తే అటు మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులకు, ఇటు ఈ దేశానికి ఎంతో మేలుచేసిన వారవుతారు. జయహో భారతదేశ యువత!(బుగ్గన మధుసూదనరెడ్డి, సామాజిక విశ్లేషకుడు).
0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *