రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను శిధిల విగ్రహాలుగా దిగజార్చిన పాలకులు….. .బొజ్జా దశరథరామిరెడ్డి.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను శిధిల విగ్రహాలుగా  దిగజార్చిన పాలకులు….. .బొజ్జా దశరథరామిరెడ్డి.

రాయలసీమ బ్రతకడానికి రాయలసీమ సమాజం మొద్దు నిద్ర వీడండి.

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- రాయలసీమ పట్ల పాలకుల వివక్షతకు, అలక్ష్యానికి రాయలసీమ ప్రాజెక్టులు వాస్తవ పరిస్థితులకు దర్పణం పడుతున్నాయనీ, రాయలసీమ లోని సాగునీటి ప్రాజెక్టులు కేవలం శిధిల విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని సమాజం ముందుండడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో నాలుగు రోజులపాటు 46 సెంటిగ్రేడ్ డిగ్రీల వేడిలో ప్రాజెక్టుల సందర్శన చేపట్టడం జరిగిందన్నారు.ఈ ప్రాజెక్టుల సందర్శనలో అత్యంత పురాతనమైన కె సి కెనాల్, తుంగభద్ర ఎగువ మరియు దిగువ ప్రాజెక్టులు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ‌కు కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నలబై సంవత్సరాల క్రితం ప్రారంభించిన తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, పది సంవత్సరాల క్రితం ప్రకటించిన గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్ డి ఎస్ కుడి కాలువ, రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని నిలువజేసే రిజర్వాయర్లు అలగనూరు, గోరుకల్లు తదితర నిర్మాణాలు అన్ని ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిచ్చాయి.‌ త్రాగు, సాగు నీటిని వినియోగించుకునేలాగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణలు చేపట్టినట్లు మభ్యపరిచే కార్యక్రమాలను మాత్రమే‌ పాలకులు చేసిన విషయం ఈ సందర్శన స్పష్టపరిచింది.ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయంగా, సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు కృష్ణా జలాలను దోచిపెట్టడానికి వీలున్న చోటల్లా రాయలసీమ ప్రాజెక్టులు నీరు వినియోగించుకోకుండా వ్యవస్థలను నాశనం చేసారు. ఇక నంద్యాల అభివృద్ధికి కీలకమైన పరిశోధన స్థానం భూములను 50 ఎకరాల వైద్యశాల ఏర్పాటుకు కేటాయించి సుదీర్ఘకాల శ్రమతో వ్యవసాయ పరిశోధనలకు అనుగుణంగా మార్చుకున్న భూమిని అత్యంత కీలకమైన సాంకేతిక సమాచారం కలిగిన భూమిని వ్యవసాయ పరిశోధన మౌళిక వసతులను ధ్వంసం చేశారు. ఈ భూములకు బదులుగా తంగడెంచలో కేటాయించిన భూముల్లో పరిశోధన స్థానం ఏర్పాటు దిశగా తొలి అడుగుగా కనీసం గడ్డిపరకలను తొలగించే కార్యక్రమాన్ని కూడా పాలకులు చేపట్టలేదు. రాయలసీమ అభివృద్ధికి, అస్తిత్వానికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలు పాలకులు చేస్తున్న నేపథ్యంలో, రాయలసీమ సమాజం గాడ నిద్ర నుండి మేలుకొని రాయలసీమను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్ష్యులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, రాఘవేంద్ర గౌడ్, భాస్కర్ రెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా, మనోజ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ పర్వేజ్, పట్నం రాముడు, మధుసూదన రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

0Shares
Categories: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *