రారండోయ్ వింతలు చూద్దాం….. హొగెనకల్ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మాయం !!
క్యాపిటల్ వాయిస్, పర్యాటక సమాచారం :- సాధారణంగా జలపాతాలు మన జీవితంలో చూస్తూనే ఉంటాము. అవి చూడటానికి ఆహ్లాదకరంగా, మనసును రంజింపజేసే ఉరవడిలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా,
సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందాల జలపాతం హోగెనక్కల్ మాత్రమే, ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలతరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందాల జలపాతం హోగెనక్కల్. దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించని ఈ జలపాతానికి కి.మీ. దూరం నుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది. దగ్గరికీ వెళ్లాక మనల్ని మనమే మర్చిపోతాం. భారతీయ నయాగరా జలపాతంగా పిలిచే ఈ జలపాతం అందాలను వానాకాలంలో చూసిన వారెవరైనా ఆనందంతో తడిసిముద్దయిపోతారు. ఈ వానాకాలం తప్పకుండా సందర్శించాల్సిన అందాల విడిది హోగెనక్కల్ వాటర్ పాల్స్ మీకోసం.హొగెనక్కల్ జలపాతం కావేరీ నది ప్రాంతంలో
ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది.. ఇది తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంటుంది. బెంగళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరం లో ఉంటుంది. కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలో, ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం.. అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. వానకాలంలో ఈ జలపాతం అందాలను చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. జలపాతం నుండి జాలువారే నీరు రాళ్ళ మీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంటుంది. కన్నడంలో హొగె అనగా పొగ, కల్ అంటే రాయి కలిపి హొగెనక్కల్ అంటే పొగలు చిమ్మే రాయి లేదా మంచు తుంపరల నుండి వచ్చే శబ్దం అని అర్థం.నిజానికి ఇక్కడ ఉన్నది ఒక జలపాతం కాదు. అనేక జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్.కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలలో తలకావేరి వద్ద జన్మించిన కావేరి నది తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది. కొండ వాలులో ప్రవాహ వేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది. హొగెనక్కల్ చేరేసరికి కావేరి నది చాలా విశాలంగా తయారై కొండ చరియల మీదు గా కిందికి జారుతూ.. జలపాతాల సమూహాన్ని తయారుచేస్తుంది. ఇక్కడి రెండు కొండలు ఒకే కొండ రెండుగా మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. జలపాతం లోని నీరు దక్షిణంగా ప్రవహించి స్టాన్లీ జలాశయంలోకి
చేరుతాయి. సుమారు 60 చ.మైళ్లు విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయం పై నిర్మించిన డ్యామ్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. అలాగే పంట పొలాలకు సాగునీరు అందుతున్నది.
ఔషధగుణాల నీరు……
హొగెనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్‌కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో చేసే మర్దనతో కీళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటారు. వేలాదిమంది ఈ జలపాతం కింద జలకాలాడుతారు. దానికనుగుణంగా ఇక్కడ వంతెనలు ఏర్పాటు చేశారు. ఇక్కడి స్థానికులకు ఆయుర్వేద తైలాల తయారీ ఓ కుటీర పరిశ్రమ.అలాగే హొగెనక్కల్ ట్రిప్‌లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది
ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే వారిలో చాలామంది ఈ చేపల రుచిని ఆస్వాదిస్తారు. జలపాతం హోరులో జలపుష్పాలను ఆరగిస్తుంటే.. ఆ రుచి మరెక్కడా లభించదని పిస్తుంది.
అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.
ఎలా వెళ్లాలి….?
తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా.. బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకోవడం సులభం.బెంగళూరు వరకు విమా నం, రైలు మార్గాల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం 180 కి.మీ. ఈ ప్రాంతానికి 115 కి.మీ దూరం లో ఉన్న సేలం వరకు రైలు
మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుంచి టాక్సీలో, బస్సులో హోగెనక్కల్ చేరుకోవచ్చు. బెంగళూరు నుండి 4 గంటల్లో, చెన్నై నుంచి 6 గంటల్లో, సేలం నుంచి 2 గంటల్లో, ధర్మపురి నుంచి గంటలో చేరుకోవచ్చు. రోడ్డుకు రెండు వైపులా పచ్చని తివాచీ పరిచినట్టుగా మల్బరీ తోటలు ఉంటాయి.
Leave a Reply