రైతులకు సాగులో  పని తగ్గిస్తున్న యంత్రాలు…. !?

రైతులకు సాగులో  పని తగ్గిస్తున్న యంత్రాలు…. !?

క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతున్నది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికీ జఠిలంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో
దీనికి పరిష్కారం లేదా? అంటే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక, సమయం కూడా కలిసి వస్తుంది. శ్రమ తక్కువగా వుండి లాభం పెరుగుతుంది. దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. మెట్ట మాగాణుల్లో ప్రస్తుతం అందుబాటులో వున్న కొన్ని ముఖ్యమైన వ్యవసాయ యంత్రాలు, వాటి పనితీరు, ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఇన్నాళ్లు మూస పద్ధతి లో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు వినూత్న సాగుపై దృష్టి సారించారు. ఆధునిక యంత్రాలతో సేద్యం చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు. రైతులను వేధిస్తున్న కూలీల కొరత యంత్రాల వినియోగం తో తీరుతున్నది. గ్రామాల్లో పత్తి, జొన్న, కంది, వరి తదితర
పంటలు సాగవుతున్నాయి. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసినప్పటి నుంచి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కూలీలు అందుబాటులో లేక యంత్రాల వైపు మొగ్గు చూపారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నారు.

బరువైన నల్లరేగడి నేలల్లో కూడా ఈ యంత్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. నేల పరిస్థితి, స్వభావాన్ని బట్టి ఎకరా పొలాన్ని ఒకటిన్నర నుంచి రెండు గంటల్లో నాటుకోవచ్చు. ఈ యంత్రాలతో వరి నాట్లు వేసేటప్పుడు నారు ను ప్రత్యేకంగా ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెకనైజ్డ్ శ్రీ విధానంలో మంచి ఫలితాలు వస్తున్న దృష్ట్యా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ విధానంలో సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను  ఒక ప్యాకేజీగా రూపొందించి రైతులకు అందిస్తున్నారు. వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్ తో విత్తే విధానం లో ఇటీవల కాలంలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా మొలక వచ్చిన విత్తనాన్ని ఒకేసారి 8సాళ్లలో విత్తుకోవచ్చు. ఈ విధమైన సాగులో వరి నారు పెంచడం, నాటడం ఉండదు కనుక ఎకరానికి 2-3 వేల వరకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. ఒక మనిషి డ్రమ్ సీడర్ లాగటానికి, మరొకరు విత్తనం నింపటానికి అవసరమవుతారు.  ఎకరా పొలాన్ని విత్తటానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ డ్రమ్ సీడర్ ధర చాలా తక్కువే ఉంటుంది.

కొన్ని యంత్రాల గురించి తెలుసుకుందాం


పవర్‌ వీడర్‌… 
పవర్‌ వీడర్‌ యంత్రాలు రెండు రకాలు. ఒకటి కలుపు తీయడానికి ఉపయోగిస్తే, ఇంకొకటి పొలం దున్నేందుకు ఉపయోగపడుతాయి. ట్రాక్టర్‌లు వెళ్లేందుకు వీలుగాని పొలాల వద్దకు సులువుగా తీసుకెళ్లొచ్చు. పైగా కరిగట్లలో బురదలోనూ
సులభంగా దున్నవచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పత్తి, జొన్న పంట పొలాల్లో కలుపు తీసేందుకు పవర్‌ వీడర్‌ను ముమ్మరంగా వాడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కలుపు తీయడం తో పాటు ఖర్చు సైతం తక్కువేనని రైతులు
పేర్కొంటున్నారు. బురదలో దున్నే యంత్రం ధర సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుంది. మిగతావి యంత్రం రకాన్ని బట్టి ధరలు ఉంటాయి.

కల్టివేటర్‌…..
ట్రాక్టర్‌కు అనుసంధానంగా ఉండే యంత్రం కల్టివేటర్‌. ఈ యంత్రం పొలాల్లో దుక్కి దున్నేందుకు ఉపయోగపడుతుంది. గతంలో ఎడ్ల నాగలితో రోజంతా దున్నిన పొలాన్ని కల్టివేటర్‌తో గంటలోనే దున్నేస్తున్నారు. దీంతో శ్రమ, సమయం ఆదా
అవుతుంది. దీని ధర రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందజేస్తున్నది.


మేజ్‌సెల్లార్‌…. 
మక్కలు, జొన్న కంకులు పట్టేందుకు మేజ్‌సెల్లార్‌ యంత్రాన్ని ఉపయోగిస్తారు. మార్కెట్లోకి ఇటీవలే వచ్చింది. ఇంతకు ముందు కంకి పొట్టు తీసే యంత్రం అందుబాటులోకి ఉండగా, ఇది కంకి పొట్టు తీయకుండానే ముక్కలను వేరు చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న యంత్రంతో 50 క్వింటాళ్ల ను పట్టాలంటే నాలుగు గంటలకు పైగా సమయం పట్టేది. కానీ మేజ్‌సెల్లార్‌ యంత్రంతో గంటలోనే పట్టొచ్చు. ధర సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుంది.


రోటవేటర్‌
రోటవేటర్‌ యంత్రాన్ని ట్రాక్టర్‌కు బిగించి నడిపిస్తారు. ఇది వ్యవసాయంలో అన్ని పరికరాల కంటే అధికంగా ఉపయోగపడుతుంది.  పంట పూర్తైన తర్వాత కొయ్యలు, గడ్డిని కాల్చడంతో భూసారం కోల్పోతుంది. దీనికి బదులుగా రోటవేటర్‌ను ఉపయోగిస్తే గడ్డిని, కొయ్యలను భూమిలో కలియదున్ని మెత్తగా చేస్తుంది. దీంతో నేల సారవంతమవడంతో పాటు మరో పంటను త్వరగా వేసుకునేందుకు వీలుంటుంది. రైతులు దీని వాడకాన్ని పెంచుతున్నారు. దీని ధర రూ.లక్షా 5వేలు ఉంటుంది. సబ్సిడీలో తక్కువగా ఉంటుంది.

సీడ్‌ కంపర్టిలైజర్‌డ్రిల్‌..
ఈ యంత్రం ట్రాక్టర్‌కు అనుసంధానంగా పని చేస్తుంది. ఈ యంత్రంలో విత్తనాలు ఎరువులు పోసి ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దుక్కిలో దున్నితే సరైన మోతాదులో విత్తనాలను, ఎరువులను ఒకేసారి వదులుతుంది. దీని వల్ల కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయానికి విత్తనాలు, ఎరువులను చల్లుకోవచ్చు. ధర సుమారు రూ.48 వేలు ఉంటుంది.

గతంలో కంటే వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. యంత్రాలను ఉపయోగించడం వల్ల శ్రమతో పాటు సమయం ఆదా అవుతున్నది. యంత్రాల వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు కూలీల కొరత తీరుతున్నది. ముఖ్యంగా యువ రైతులు యంత్ర సాగుపై దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయం విదేశాల్లో మాదిరిగా మన దగ్గర కూడా ప్రతి పనికి ఓ యంత్రం రావొచ్చు. ఇంకా యంత్రాలకు సంబందించిన సమాచారం చాలా ఉంది. ఈ సమాచారాన్ని మరి కొద్ది రోజుల్లో తెలుసుకుందాం

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *