క్యాపిటల్ వాయిస్, అమరావతి :- నేటి సమాజంలో చాప క్రింద నీరులా విస్తరిస్తున్న, పడగవిప్పి బుసలు కొడుతున్న ఈ మాయదారి బెట్టింగ్! ఈ మధ్యకాలంలో ఐపీఎల్ – 2024 17 వ సీజన్ ప్రారంభం పుణ్యమా అని ఒక్కసారిగా బెట్టింగ్ దందా చాప క్రింద నీరులా విస్తరిస్తూ పడగవిప్పి బుసలు కొడుతున్న వైనం ఈ సమాజానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే మున్ముందు ఎంతో ఉజ్వల భవిష్యత్ వున్న యువత ఈ మాయదారి బెట్టింగ్ ఉచ్చు లో పీకలదాక కురుకుపోయి అటు ఎంతో అమూల్యమైన డబ్బును కోల్పోవడంతో పాటు,ఇటు చదువులను ఆటకెక్కిస్తూ అదోగతి పాలుఅవుతున్నారు అనే మాట సత్యదూరం కాదు. అయితే ఈ బెట్టింగ్ జాడ్యాన్ని, జూదాన్ని అరికట్టడానికి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి అవేవి కూడా పూర్తిస్థాయిలో సత్పలితాలను ఇవ్వకపొవ్వడం అత్యంత దురదృష్టకరమైన విషయం.అన్నింటికి మించి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై, అడుగుజాడలపై సరిఅయిన పర్యవేక్షణ కొరవడటం, మొబైల్ ఫోన్లను వారికి అప్పనంగా అప్పజెప్పి చోద్యం చూస్తుండటంతో విద్యార్థులు సెల్ ఫోన్లను ఉపయోగించి బెట్టింగ్ అనే ఈ అనాగరిక క్రీడకు పదే పదే అజ్యం పోస్తూ, దాసోహం అవుతూ, పెడ దారిన పయనిస్తూ తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న కొండంత,గంపెడు ఆశలపై నీళ్లు చల్లుతుండటం ఎంతైనా బాధాకరమైన విషయం. విద్యార్థులు క్రికెట్ మ్యాచ్ లు ఆడటం, చూడటంలో ఏ మాత్రం తప్పు లేదు కాని ఇలా వేలం వెర్రిలా క్షణికావేశంలో మంచి ఏదో, చెడు ఏదో కూడా తెలుసుకోలేని ఈ తెలిసి తెలియని పసివయస్సులో బెట్టింగ్ అనే మాయదారి జూదంలో అడుగుపెట్టడమే కాదు, అందులో నుంచి బయటపడలేక ఒక్కొక్కసారి ఆ అనాగరిక పోకడ మూలాన వేలాది,లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు సైతం చేసుకుంటుండటం మనం తరచుగా న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియా ఛానెళ్లలో చూస్తూ ఉంటాము అనే విషయం ఎవరూ కూడా కాదనలేని జగమెరిగిన సత్యం కూడా. అయితే మంచి ఉన్నత చదువులు చదువుకొని రేపటి దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహించాల్సిన నేటి యువత, విద్యార్థులు ఇలా బెట్టింగ్ లాంటి విష క్రీడలో కాలు మోపుతుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత శోచనీయమైన, ఏ మాత్రం మింగుడుపడని విషయం. ఏదిఎమైన ఇప్పటికయినా విద్యార్థుల తల్లిదండ్రులు కళ్ళు తెరచి, నిద్రాణావస్థ నుండి మేల్కొని తమ పిల్లలను వారి మానాన వారిని విచ్చలవిడిగా వదిలివెయ్యకుండా, కాస్తంత భాద్యతతో వ్యవహారిస్తూ వారిని అనుక్షణం ఓక కంట కనిపెడుతూ వారి ఉన్నత, ఉజ్వల భవిష్యత్ కు బంగారు బాట వేయాల్సిన గురుతర భాద్యత ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులపై ఎంతైనా వుంది. ఏమైనా పోలీసు డిపార్ట్మెంట్ వారు సైతం ఈ బెట్టింగ్ అనే ఈ విష మాయాజాలన్ని పెంచి పోషిస్తున్న వారిపై కొరడా గుళిపించి, వారి భరతం పట్టి, ఈ అనాగరిక క్రీడను కుక్కటి వ్రేళ్ళతో సహా పేకలించేందుకు నడుం బిగిస్తే ఈ సమాజం, ఈ సమాజంలోని యువతకు ఎంతో గొప్ప మేలు చేసినవారవుతారు. అలాగే బెట్టింగ్ అనే ఈ విష నాగు, సర్పం నేటి విద్యార్థుల పాలిట ఓక పెను శాపం కాకముందే ఈ సమాజంలోని బాధ్యత గల ప్రతి పౌరుడు సత్వరమే మేల్కొని ఈ బెట్టింగ్ నిర్ములనకు తమ వంతుగా యుద్ధ ప్రాతిపదికన ఓక భగీరథ ప్రయత్నం ఖచ్చితంగా గావించాలి. అప్పుడే నేటి యువత, విద్యార్థుల భవిష్యత్ మున్ముందు మరో పది కాలాలపాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లితీరుతుంది. (బుగ్గన మధుసూదనరెడ్డి, సామాజిక విశ్లేషకుడు)
Leave a Reply