సాంఘిక శాస్త్ర అధ్యాయనానికి తిలోదకాలు..!?
*సమాజాన్ని తీర్చిదిద్దే విద్యను మనమే విస్మరిస్తున్నామా !!
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- “మానవుడు సంఘజీవి” అని ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ ఒక్క మాటలోనే సాంఘిక శాస్త్రం యొక్క సంపూర్ణ ప్రాముఖ్యత దాగి ఉంది. మనిషి ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శాస్త్రవేత్తైనా, ఎంతటి వ్యాపారవేత్తైనా, ఎంతటి ఉన్నతాధికారైనా అతని జీవితం సమాజంతో ముడిపడి ఉంటుంది. కుటుంబం, పాఠశాల, సమాజం, సంస్కృతి, పర్యావరణం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు—ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అందుకే మనిషిని అర్థం చేసుకోవాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.సాంఘిక శాస్త్రం అనేది కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే ఒక సబ్జెక్టు కాదు. అది మనిషిని బాధ్యతగల పౌరుడిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దే జీవన విద్య. మనిషికి సమాజంతో ఉన్న సంబంధం, పర్యావరణంతో ఉన్న అనుబంధం, భిన్న సంస్కృతులు, విభిన్న వర్గాల ప్రజల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, మానవ హక్కులు, సామాజిక బాధ్యతలు వంటి అంశాలన్నింటినీ సాంఘిక శాస్త్రమే బోధిస్తుంది. సమాజంలో ఎందుకు అసమానతలు ఏర్పడతాయి? పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు కారణాలేమిటి? ప్రకృతి వనరులను ఎలా సంరక్షించాలి? సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పేది కూడా ఇదే.సాంఘిక శాస్త్రంలోని ప్రతి విభాగం మన జీవితానికి ఎంతో అవసరం. చరిత్ర మన గతాన్ని పరిచయం చేసి భవిష్యత్తుకు దారి చూపుతుంది. భూగోళ శాస్త్రం భూమి, నేలలు, నదులు, ఖనిజాలు, అటవీ సంపద, వాతావరణం, ప్రకృతి వనరుల ప్రాముఖ్యతను వివరిస్తుంది. పౌరశాస్త్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఎన్నికలు, ప్రభుత్వం, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తుంది. అర్థశాస్త్రం ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ఉపాధి, ఆదాయం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలను వివరిస్తుంది. ఈ నాలుగు శాఖలు కలిసి ఒక వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దుతాయి. అందుకే సాంఘిక శాస్త్రం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేయాల్సిన సబ్జెక్టు.అయితే దురదృష్టవశాత్తూ నేడు సాంఘిక శాస్త్రం క్రమంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. పాఠశాలల్లో టైమ్‌టేబుల్‌లో దీనికి తక్కువ పీరియడ్లు కేటాయిస్తున్నారు. విద్యార్థులు అత్యంత చురుకుగా ఉండే ఉదయం వేళల్లో గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ, సోషల్ స్టడీస్‌ను మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా సాయంత్రం సమయాల్లో బోధించే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల్లో ఈ సబ్జెక్టుపై ఆసక్తి తగ్గుతోంది. పదో తరగతి తర్వాత “మేము సైన్స్ చదువుతాం… సోషల్ ఎందుకు?” అనే భావన కూడా పెరుగుతోంది. కొన్ని పాఠశాల యాజమాన్యాలు కూడా సోషల్ స్టడీస్‌ను రెండో శ్రేణి సబ్జెక్టుగా పరిగణించడం ఆందోళన కలిగించే విషయం.
ఈ నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టం చాలా తీవ్రమైనది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా సమాజం గురించి అవగాహన లేని వ్యక్తి మంచి పౌరుడిగా ఎదగలేడు. ఇతరులను గౌరవించడం, భిన్నత్వాన్ని అంగీకరించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, పర్యావరణాన్ని సంరక్షించడం, సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం వంటి లక్షణాలు సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారానే పెంపొందుతాయి. నేటి సమాజంలో కొంతమంది విద్యార్థుల్లో కనిపిస్తున్న అసహనం, సామాజిక బాధ్యతల పట్ల నిర్లక్ష్యం, చరిత్రపై అవగాహన లేకపోవడం, రాజ్యాంగ విలువల పట్ల నిరాసక్తత వంటి పరిణామాలకు సాంఘిక శాస్త్రానికి తగ్గుతున్న ప్రాధాన్యం కూడా ఒక కారణమని అనేక మంది విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సాంఘిక శాస్త్రానికి తగిన గౌరవం కల్పించాలి. టైమ్‌టేబుల్‌లో తగిన పీరియడ్లు కేటాయించాలి. విద్యార్థులు ఉత్సాహంగా ఉండే ఉదయం వేళల్లో కూడా సోషల్ స్టడీస్ బోధించాలి. మ్యాప్‌లు, చర్చలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ విజిట్‌లు, ప్రస్తుత సామాజిక అంశాలపై విశ్లేషణ వంటి ఆధునిక బోధనా పద్ధతులను ప్రోత్సహించాలి. సమాజాన్ని అర్థం చేసుకున్న విద్యార్థే భవిష్యత్తులో బాధ్యతగల పౌరుడిగా, మంచి నాయకుడిగా, మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడు. అందుకే సాంఘిక శాస్త్రానికి తిలోదకాలు ఇవ్వడం కాదు… దానికి తగిన గౌరవం, సముచిత స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ఒక సబ్జెక్టును కాపాడటం మాత్రమే కాదు; భవిష్యత్తు సమాజాన్ని కాపాడటమే.(మునిపల్లి సురేష్ బాబు జర్నలిస్ట్,అమరావతి,9951173460)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *