एक-क्लिक आयातको साथ मिनेटमा तपाईंको वेबसाइट बनाउनुहोस् - कुनै कोडिङ झन्झट छैन!
జర్నలిస్టుల భద్రతలో వార్త ముఖ్యమా..? ప్రాణం ప్రధానమా..!?*
◆ *జర్నలిస్టుల భద్రత కోసం ప్రతి జర్నలిస్ట్ చదవాల్సిన కథనం.*
జర్నలిజం అనేది కేవలం వార్తలు రాసే వృత్తి మాత్రమే కాదు. సమాజానికి నిజాన్ని అందించే బాధ్యత. ముఖ్యంగా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు, అగ్నిప్రమాదాలు, వరదలు, యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు, రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసే జర్నలిస్టుల పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు వేగంగా, వాస్తవమైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైనది తమ వ్యక్తిగత భద్రత. ఒక మంచి జర్నలిస్ట్ వార్తను ముందుగా అందించాలనే ఆత్రుతతో వ్యవహరించకూడదు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకుని, తన భద్రతను కాపాడుకుంటూ, నిజానిజాలను నిర్ధారించి వార్త అందించాలి. ఎందుకంటే ప్రాణం ఉంటేనే మరో వార్తను కవర్ చేయగలం.
*ప్రతికూల పరిస్థితుల్లో జర్నలిస్టు ఎలా వ్యవహరించాలి.*
1.పరిస్థితిని ముందుగా అంచనా వేయాలి:సంఘటన స్థలానికి వెళ్లే ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పోలీసులు, స్థానిక అధికారులు లేదా సహచరుల ద్వారా ప్రాథమిక సమాచారం సేకరించాలి. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటే అధికారుల సూచనలు పాటించాలి.
2.వ్యక్తిగత భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి: వార్త కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టకూడదు.అగ్నిప్రమాదాలు, వరదలు, భవనాల కూలిపోవడం, రసాయన లీకేజీలు, విద్యుత్ ప్రమాదాలు వంటి చోట్ల సురక్షిత దూరం పాటించాలి.
3.అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఏర్పాటు చేసిన భద్రతా పరిమితులను దాటకూడదు. వారి పనికి ఆటంకం కలిగించకూడదు.
4.భావోద్వేగాలకు లోనుకాకూడదు: ప్రమాదంలో గాయపడిన వారిని చూసి భావోద్వేగానికి లోనవడం సహజం. అయినప్పటికీ వార్తా సేకరణలో వాస్తవాలను మాత్రమే నమోదు చేయాలి. అతిశయోక్తులు, ఊహాగానాలు నివారించాలి.
5.సమాచారాన్ని ధృవీకరించాలి:ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రతి విషయాన్ని వెంటనే ప్రసారం చేయకూడదు. కనీసం రెండు విశ్వసనీయ వనరుల ద్వారా నిర్ధారించుకుని మాత్రమే వార్త ఇవ్వాలి.
*బ్రేకింగ్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.*
నేటి డిజిటల్ యుగంలో “ముందుగా చెప్పాలి” అనే పోటీ పెరిగింది. కానీ “ముందుగా చెప్పడం” కంటే “సరైనది చెప్పడం” జర్నలిజం యొక్క అసలైన విధానం
1.వేగం కంటే ఖచ్చితత్వం ముఖ్యం: మొదటగా వార్త ఇవ్వాలనే తొందరలో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఒక చిన్న పొరపాటు మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
2.అధికారిక సమాచారం కోసం వేచి చూడాలి: మరణాల సంఖ్య, గాయపడిన వారి వివరాలు, కారణాలు వంటి అంశాలను అధికారికంగా నిర్ధారించిన తర్వాత మాత్రమే ప్రసారం చేయాలి.
3.ఊహాగానాలు చేయకూడదు:”ఇది ఉగ్రదాడి కావచ్చు”, “ఇంకా భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉంది” వంటి ఆధారంలేని వ్యాఖ్యలు చేయరాదు.
4.లైవ్ రిపోర్టింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: లైవ్ ప్రసారంలో మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి,తెలియని విషయాలను తెలిసినట్లుగా చెప్పకూడదు.
5.బాధితుల గౌరవాన్ని కాపాడాలి:గాయపడినవారి, మృతదేహాల క్లోజ్ విజువల్స్ ప్రసారం చేయకుండా నైతిక ప్రమాణాలు పాటించాలి. చిన్నారుల వివరాలను ప్రత్యేక జాగ్రత్తతో నిర్వహించాలి.
6.సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మకూడదు: వైరల్ వీడియోలు, పోస్టులు, ఫార్వర్డ్ సందేశాలు నిజమా కాదా అని ధృవీకరించిన తర్వాతే ఉపయోగించాలి.
7.పుకార్లను వ్యాప్తి చేయకూడదు:జర్నలిస్టు పని సమాచారం అందించడం. భయాందోళనలు సృష్టించడం కాదు.
*ఫీల్డ్ రిపోర్టర్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిన సామగ్రి.*
పూర్తి ఛార్జ్ ఉన్న మొబైల్ ఫోన్, పవర్ బ్యాంక్,కెమెరా అదనపు బ్యాటరీలు,మైక్, ఐఎఫ్‌బీ కేబుల్స్,రెయిన్ కోట్ లేదా రిఫ్లెక్టివ్ జాకెట్,ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్, తాగునీరు,నోట్‌బుక్, పెన్,ప్రెస్ ఐడీ కార్డు.
*ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు.*
● వరద ప్రాంతాల్లో: ప్రవాహంలోకి వెళ్లకూడదు. నీటి లోతు అంచనా వేయకూడదు.
● అగ్నిప్రమాదాల్లో: పొగ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకూడదు. అగ్నిమాపక సిబ్బంది సూచనలు పాటించాలి.
● రోడ్డు ప్రమాదాల వద్ద: ట్రాఫిక్‌కు అడ్డుగా నిలవకూడదు.రక్షణ చర్యలకు ఆటంకం కలిగించకూడదు.
● అల్లర్ల సమయంలో: గుంపుల మధ్యకు వెళ్లకుండా సురక్షిత స్థలం నుంచి సమాచారం సేకరించాలి.
● విపత్తుల సమయంలో: విద్యుత్ తీగలు, గ్యాస్ లీకేజీలు, కూలే భవనాల ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు గమనించాలి.
*మంచి జర్నలిస్టు పాటించాల్సిన ఐదు సూత్రాలు.*
1.వాస్తవం ముందు – వేగం తర్వాత.
2.భద్రత ముందు – సంచలనం తర్వాత.
3.ధృవీకరణ ముందు – ప్రసారం తర్వాత.
4.మానవత్వం ముందు – ప్రత్యేక వార్త తర్వాత.
5.బాధ్యత ముందు – పోటీ తర్వాత.
చివరిగా ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసే జర్నలిస్టు కేవలం వార్తా ప్రతినిధి మాత్రమే కాదు,ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని చేరవేసే బాధ్యతగల వృత్తి నిపుణుడు.బ్రేకింగ్ న్యూస్ అనేది వేగానికి పరీక్ష అయితే, బాధ్యతాయుతమైన జర్నలిజం నిజాయితీకి పరీక్ష. ఒక మంచి జర్నలిస్టు సంచలనాన్ని కాదు, సత్యాన్ని వెంబడిస్తాడు. వార్త కోసం ప్రమాదాన్ని అంచనా వేయకుండా ముందుకు వెళ్లడం ధైర్యం కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని, తన భద్రతను కాపాడుకుంటూ, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించడం నిజమైన వృత్తి నైపుణ్యం.జర్నలిజం లో జర్నలిస్టులు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.అదే..,”వార్త విలువైనదే..,కానీ జర్నలిస్టు ప్రాణం అంతకంటే విలువైనది.” అయినా వార్తల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే పరిస్థితులు ఒకనాటి మాటే గానీ,ఇప్పుడైతే ఆ పరిస్థితులు ఉన్నా..,అంతటి సాహసం చేసే జర్నలిస్టులు ఉన్నారా…?లేరా…?అనే ప్రశ్నకు సమాధానం ప్రజలకు తెలియనిదేమీ కాదు.
ఈపూరి రాజారత్నం,*
*MA,mjmc(Ph.D)*
*సీనియర్ జర్నలిస్ట్*
*9390062078*
