एक-क्लिक आयातको साथ मिनेटमा तपाईंको वेबसाइट बनाउनुहोस् - कुनै कोडिङ झन्झट छैन!

◆ *మూడు రాష్ట్రాల ఐక్యతకు, రైతు భవిష్యత్తుకు కొత్త దిశ.*
*(ఈపూరి రాజారత్నం, సీనియర్ జర్నలిస్ట్)*
కర్ణాటక రాష్ట్రంలోని హోసపేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చొరవతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై సమావేశమవడం దేశ సమైక్యతకు, జలవనరుల సమర్థ వినియోగానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
మూడు రాష్ట్రాల లక్షలాది మంది రైతులకు సాగునీటిని, కోట్లాది ప్రజలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు దక్షిణ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. “తుంగా పానం – గంగా స్నానం” అనే ప్రసిద్ధ సామెతను ప్రస్తావిస్తూ, తుంగ నది జలాల ప్రాముఖ్యతను వివరించారు. 2024లో తుంగభద్ర డ్యామ్‌లో 19వ గేటు దెబ్బతిన్న సమయంలో నిపుణుల సలహాలతో అత్యవసర చర్యలు చేపట్టి నీటి వృథాను అరికట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి 33 కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా డ్యామ్‌కు కొత్త జీవం పోశాయని తెలిపారు.
దేశ అభివృద్ధిలో మౌలిక సదుపాయాల అనుసంధానం ఎంత కీలకమో, జలవనరుల అనుసంధానం కూడా అంతే అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వన్ నేషన్ – వన్ గ్రిడ్’, టెలికాం మరియు జాతీయ రహదారి నెట్‌వర్క్‌ల వంటి కార్యక్రమాలు దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని చెప్పారు. ఇదే దిశలో గంగా నుంచి కావేరి వరకు నదులను అనుసంధానించే మహత్తర ప్రణాళిక అమలైతే దేశ వ్యవసాయ రంగానికి, నీటి భద్రతకు కొత్త బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన, గోదావరి–కావేరి నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి నదుల అనుసంధానం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారమని ఆయన పునరుద్ఘాటించారు. ముందుగా రాష్ట్రాల పరిధిలోని నదులను పరస్పరం అనుసంధానించి, అనంతరం అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి అడుగులు వేయాలని సూచించారు. తుంగభద్ర నది కేవలం జలవనరు మాత్రమే కాదని, దక్షిణ భారత చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని చంద్రబాబు పేర్కొన్నారు.విజయనగర సామ్రాజ్య వైభవానికి, హంపీ చారిత్రక నగరానికి ఈ నది సహజ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష దేవాలయం, రాఘవేంద్ర స్వామి మఠం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు తుంగభద్ర తీరం వెంబడి వెలసి భారతీయ సంస్కృతికి చిరస్థాయిగా నిలిచాయని గుర్తు చేశారు.
“రాష్ట్రాలుగా మనం వేరైనా, దేశంగా మనమంతా ఒక్కటే” అని పేర్కొంటూ, రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై రైతుల ప్రయోజనాలపై చర్చించడం శుభపరిణామమని అభివర్ణించారు.తుంగభద్ర ప్రాజెక్టు పునరుద్ధరణతో ప్రారంభమైన ఈ సహకార భావన భవిష్యత్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల నిర్వహణకు ఆదర్శంగా నిలుస్తుందని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా అందరూ కలిసి ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
