భారీ ధరలకు అమ్ముడుపోయిన రాజ్యసభ స్థానాలు….మేడా శ్రీనివాస్

# జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం ఎక్కడ..!?

 

క్యాపిటల్ వాయిస్,రాజమండ్రి, జూన్ 14:- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాలు వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని, రాజకీయ పార్టీల కోసం జీవితాలను అంకితం చేసిన దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలకు చట్టసభలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు.రాజమండ్రిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ స్థానాలను ధనికులకు కట్టబెట్టడం ద్వారా రాజకీయ పార్టీలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాయని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీల్లో దిగువస్థాయి నాయకులు జెండాలు మోయడానికి, నినాదాలు చేయడానికి మాత్రమే పరిమితమవుతున్నారని, కీలక పదవులు మాత్రం ఆర్థికంగా బలమైన వ్యక్తులకు దక్కుతున్నాయని ఆరోపించారు. రాజకీయ నాయకుల పట్ల అంధ విధేయతతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సమాజం, కుటుంబం, రాష్ట్రం, దేశం కోసం పనిచేసే నాయకులకు మద్దతు ఇవ్వడం సమంజసమే అయినప్పటికీ, వ్యక్తి పూజ, బానిసత్వ ధోరణి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలను విమర్శలకు అతీతంగా భావించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా, వైద్య వ్యవస్థలను నియంత్రించి, ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అప్పుల భారం మోపుతూ సంక్షేమం పేరుతో ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్న పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.కొన్ని మీడియా సంస్థలు ప్రజా సమస్యల కంటే రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించిన ఆయన, ప్రజల్లో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే పాత్రను మీడియా పోషించాలని సూచించారు. యువత విజ్ఞానం, సామాజిక చైతన్యాన్ని పెంచే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.దేవాలయాల ఆస్తులు, దేవాదాయ నిధుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులను రాజకీయ అవసరాలకు వినియోగించడం సరికాదని, దేవాలయాల స్వతంత్రతను కాపాడాలని అన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా దేవాలయాల నిర్వహణ ఉండాలని కోరారు. ప్రస్తుతం యువతను కుల, రాజకీయ, సినీ ప్రభావాల వైపు మళ్లిస్తున్న పరిస్థితులు ఆందోళనకరమన్నారు. యువత తమ శక్తి, సమయాన్ని ఉపాధి, విద్య, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాలపై కేంద్రీకరించాలని సూచించారు. కుల ఉద్యమాల కంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి, విద్య, ఉపాధి ఉద్యమాల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి యువత వెన్నుదన్నుగా నిలవాలని, వారి త్యాగాలు దేశ భద్రతకు, రాష్ట్రాల అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలని మేడా శ్రీనివాస్ కోరారు.సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ నాయకుడు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, సిమ్మా దుర్గారావు, దుడ్డే త్రినాద్, ఎం.డి. హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మార్త ప్రభాకర్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *