ఏపీ పేపర్ మిల్లు కాలుష్యంపై సమగ్ర విచారణ జరపాలి : మేడా శ్రీనివాస్
క్యాపిటల్ వాయిస్,రాజమహేంద్రవరం, జూన్ 12:– రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్లు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని భద్రాచలం ఐటీసీ పేపర్ ఫ్యాక్టరీ పర్యావరణ పరిరక్షణ విషయంలో అమలు చేస్తున్న కొన్ని విధానాలు దేశంలోని ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, పరిసరాల రక్షణకు అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు చూపుతున్న చొరవను రాజమహేంద్రవరంలోని ప్రజాప్రతినిధులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు. పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న శబ్ద, వాయు, జల కాలుష్యాలపై స్థానిక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశంపై గట్టిగా స్పందించడం లేదన్నారు. ప్రజల తరఫున నిలబడాల్సిన రాజకీయ నాయకులు మిల్లు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇటీవల తాగునీటి నాణ్యత విషయంలో అధికారులు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నామని ప్రకటించారని, అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు, తూర్పు లంక ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆ వాదనలపై సందేహాలు కలిగిస్తున్నాయని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై స్వతంత్ర శాస్త్రీయ సంస్థలతో పరీక్షలు నిర్వహించి నివేదికలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొన్న ఆయన, పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, అది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జరగకూడదని స్పష్టం చేశారు.పేపర్ మిల్లు కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు దుర్వాసనలు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సమగ్ర అధ్యయనం చేపట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాల స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మేడా శ్రీనివాస్ సూచించారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించే నేపథ్యంలో ప్రజారోగ్య రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
రాజమహేంద్రవరం నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారిందన్నారు. నగర మురుగునీటి నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నగర అభివృద్ధిలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కోరారు.రాజమహేంద్రవరం అభివృద్ధి అంశాలు ఎన్నికల సమయంలో మాత్రమే చర్చకు వస్తున్నాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత సమస్యలు పక్కన పడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గోదావరి నది రక్షణ వంటి అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
