స్లైడింగ్ డోర్లు అమరిక రకాలు…. ఎలా !!
క్యాపిటల్ వాయిస్,వినియోగ సమాచారం :- ప్రస్తుత కాలంలో ఇళ్ల నిర్మాణంలో ఆధునికతను చూపించేందుకు అందరూ మొగ్గుచూపుతున్నారు. బయట ఉండే గేటు నుంచి ఇంట్లో కిటికీ వరకు కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ట్రెండీగా ఉండేందుకు అవసరమైతే ఇంటిని రీమోడలింగ్ చేసేందుకు కూడా వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో స్లైడింగ్ డోర్లు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్లైడింగ్ డోర్లు గోడకు సమాంతరంగా ఉంటాయి. ఇవి స్పేస్ తక్కువగా ఆక్రమిస్తాయి. అందుకే ఈ మధ్య ఇవి పాపులర్ అయ్యాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఈ డోర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బైపాస్ స్లైడింగ్ డోర్లు: ఈ రకం డోర్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. వీటికి కింద ట్రాక్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా అల్మారాలు లేదా సీక్రెట్ రూమ్‌ల కోసం ఉపయోగిస్తారు.
బైపోల్డ్ స్లైడింగ్ డోర్లు: ఈ రకం డోర్లు మడత పెట్టుకునేలా ఉంటాయి. వీటి ద్వారా స్థలం ఆదా అవుతుంది. తక్కువ స్థలం ఉన్న ప్రాంతాల్లో ఉపయోగానికి ఉత్తమం. చిన్న ఇళ్లకు ఇవి మంచి ఎంపిక,పాకెట్ స్లైడింగ్ డోర్స్: ఈ రకం డోర్లు స్థలాన్ని ఆదా చేయడంలో ఉపయోగపడతాయి. ఇవి గోడకు అతుక్కుపోయినట్లుగా ఉంటాయి. ఇవి ఒక గది నుంచి మరో గదికి ఎంట్రీ లా పనిచేస్తాయి.
> స్టాకర్ స్లైడింగ్ డోర్స్ : ఈ డోర్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి. వీటిలో డోర్లు ప్రత్యేకమైన ట్రాక్ లో ఉంటాయి. అయితే స్థలం ఎక్కువగా ఉన్న ఇళ్లలో వీటి ఎంపిక ఉత్తమం.
స్లైడింగ్ పేషియో డోర్స్: ఈ రకం డోర్లు బయట, లోపల వేరు చేసేందుకు బాగుంటాయి. ఇవి ఎక్కువగా గ్లాస్‌తో చేసి ఉంటాయి. దాదాపు గోడ పరిమాణంలో ఉండి, బయటి ప్రాంతాన్ని చూసేందుకు అనుకూలంగా ఉంటాయి.
» ఫ్రెంచ్ స్లైడింగ్ డోర్స్: ఈ రకం చూడటానికి స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ స్థలంలో వీటిని ఏర్పాటు చేయవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల గది కొత్త రూపు సంతరించుకుంటుంది.
షోజి స్లైడింగ్ డోర్స్: ఈ రకం జపనీస్ డోర్లు సంప్రదాయబద్ధమైనవి. ఇంటికి ప్రత్యేకతను జోడించాలనుకుంటే వీటి ఎంపిక ఉత్తమం. ఇప్పటికే ఈ తరహా డోర్లు పశ్చిమ దేశాలతో పాటు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. కర్రతో తయారు చేయడం వీటి ప్రత్యేకత.
> అకార్డియన్ స్లైడింగ్ డోర్స్: ఈ తరహా డోర్లు దేశంలో ఇప్పటికీ ఫేమస్. మ్యూజిక్ పరికరం తరహాలో ఉండే ఇవి పెద్ద స్థలాలలో అమర్చినపుడు అద్భుతంగా ఉంటాయి. చిన్న తరహా గదులకు కూడా ఇవి ప్రత్యేకంగా ఉంటాయి.
స్లైడింగ్ డోర్స్ ప్రయోజనాలు… !!
స్లైడింగ్ డోర్స్ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి చిన్న ఇళ్లకు వాడటానికి అనువుగా ఉంటాయి. ఇవి చాలా స్థలాన్ని ఆదా చేస్తాయి. అలాగే వీటిని ఎక్కువగా గ్లాస్‌తో తయారు చేస్తారు కాబట్టి వెంటిలేషన్ బాగా ఉంటుంది. అలాగే ఇవి మంచి ఇంటీరియర్ డిజైన్ కు అనువుగా ఉంటాయి. అలాగే వీటి వాడకం కూడా చాలా సులువుగా ఉంటుంది. వీటిల్లో సెన్సార్లతో వచ్చేవి కూడా ఉంటాయి. అలాగే భద్రత పరంగా కూడా ఇవి చాలా దృఢంగా ఉంటాయి. మీ అభిరుచికి, ఇంటి నిర్మాణానికి తగినట్లుగా డోర్లను ఎంచుకోవడం మంచిది.