

ఆరోగ్యానికి ఔషధం ‘మునగ’ సాగు… తెలుసుకుందామా !!
క్యాపిటల్ వాయిస్,వ్యవసాయ సమాచారం :- సమాచారం మన ఆరోగ్యం మనం తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. నేటి ఆధునిక నాగరిక జీవనం లో ప్రజలు సహజంగా లభించే ఆహార పదార్థాలను విస్మరిస్తున్నారు. రంగులు, పాలిష్ చేయబడిన ధాన్యాలు, పిండ్లు, కొవ్వు, ఉప్పు పదార్థాల వినియోగం పై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రజల్లో అనేక రకాలైన దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. వైద్యంపై చేసే ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను, ఆకుకూరలను పక్కన పెడుతున్నారు. వాటి వల్ల కలిగే లాభాలపై అవగాహన లేమి దీనికి కారణమవుతోంది. ఇలాంటి వాటిలో మునగను ప్రముఖంగా చెప్పుకోవచ్చును. ఆయుర్వేద వైద్యంలో ఆరోగ్య పరిరక్షణకు మునగకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇతర ఆహార పదార్థాలలో లేనన్ని పోషకాలు, ఔషధ గుణాలు మునగలో ఉన్నాయి. అందుకే మునగను అద్భుత వృక్షం (మిరాకిల్ ట్రీ) అంటారు.
పోషక విలువలు… !!
మునగ ఆకులు, కాయలు.. కూరగాయలుగాను, ఆరోగ్య సమస్యలకు ఔషధంగాను ఉపయోగపడతాయి. వీటిలో మనిషి ఎదుగుదలకు అవసరమైన విటమిన్-ఎ, బి, సి, లు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం వంటి ఖనిజ లవణాలు, ప్రొటీన్లు మిగతా కూరగాయల కంటే అత్యధికంగా ఉంటాయి. మునగలో నారింజ కంటే ఏడు నుండి పదిరెట్లు విటమిన్స్, క్యారెట్ కంటే పదిరెట్లు ఎక్కువ విటమిన్ ఎ, పాలకంటే 4 రెట్ల ఎక్కువ కాల్షియం, పెరుగు కంటే 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు మునగ ఆకులను, రసాన్ని, కాయలను, చెట్టు బెరడును ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వినియోగిస్తారు. ముఖ్యంగా రక్తహీనత, ఎముకలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, మలబద్దకం, కంటిచూపు వృద్ధి, గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్ సమస్యలు, ఇన్ఫెక్షన్ కట్టడికి, వీర్యకణాల వృద్ధికి మునగ అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సాగు వివరాలు…. !!
మునగను గతంలో గ్రామాల్లో ఇళ్ల దగ్గర, పొలం గట్ల వెంబడి, బావుల దగ్గర పెంచేవారు. ఈ మధ్య తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన పికెఎం-1, పికెఎం-2 వార్షిక మునగ రకాలు రైతుల్లో బాగా ఆదరణ పొందాయి. ఇవి అధిక దిగుబడులను ఇస్తుండటంతో చాలా మంది రైతులు మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మునగను ప్రధాన పంటగాను, మామిడిలో అంతర పంటగానూ సాగు చేసుకోవచ్చు. వ్యాపార సరళిలో మునగ పంట సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న ఇసుక వరుస గల మధ్య రకపు భూముల్లో బాగా పెరుగుతుంది. పికెఎం వార్షిక మునగ రకాల సాగుకు ఎకరాకు 250 గ్రా. విత్తనం అవసరమవుతుంది. మునగను నేరుగా విత్తనాలు నాటి గాని లేదా పాలిథిన్ సంచుల్లో నారుగా పెంచి గాని నాటుకోవచ్చు. నాటుటకు వరుసల మధ్య, చెట్ల మధ్య 8 అడుగుల దూరం ఉండేటట్లు 45x45x45 సెం.మీ. గుంతలను తవ్వుకోవాలి. ప్రతి గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 250గ్రా. వేపపిండి, 150గ్రా. సూపర్ పాస్పేట్, 100 గ్రా. పొటాష్ ఎరువును వేసి గుంతలను నింపుకోవాలి. ఈ గుంతలలో జూలై, ఆగష్టు మాసాల్లో విత్తనాన్ని గాని, నారుగా పెంచిన మునగ మొక్కలను గాని నాటుకోవాలి. నాటిన 3, 6 నెలల తర్వాత ప్రతి చెట్టుకు 150 గ్రా. యూరియాను పైపాటు ఎరువుగా వేయాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి… !!
మొక్కలు 4-5 అడుగులు పెరిగిన తర్వాత మొక్కల తలలను తుంచేయాలి. దీని వల్ల చెట్ల ఎత్తును అదుపు చేసి, పక్క రెమ్మలు బాగా వచ్చేటట్లు చేయవచ్చు. కాయలు కోయుటకు సులభంగా ఉంటుంది. గాలికి చెట్లు విరిగిపోవు. నాటిన 110 రోజులకు మొక్కలు పూతకు వచ్చి 170-180 రోజులకు కాయలు కోతకు సిద్ధమవుతాయి. ఆపై సుమారు 4 నెలలు కాయల దిగుబడి వస్తుంది. మొదటి సంవత్సరం కోతలు పూర్తయిన తర్వాత 7-8 అడుగుల ఎత్తులో కొమ్మలను కత్తిరించి తిరిగి కార్సీ పంటను పెంచుకోవచ్చు. ప్రతి చెట్టు నుంచి 200-225 కాయలను (50-65 కిలోలు) దిగుబడిగా పొందవచ్చు. మునగను సాధారణంగా ఆకులను తినే గొంగళి పురుగులు, కాయ ఈగ ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు పాస్పోమిడాన్ (లీటరు నీటికి 2.5 మి.లీ.) మందును పిచికారీ చేస్తే సరిపోతుంది. ఖర్చులు పోను ఎకరం మునగ సాగుతో సంవత్సరానికి 75 వేల నుండి లక్ష రూపాయల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. మునగ ఆకులను ఎండబెట్టి వివిధ రూపాల్లో ఆకర్షనీయంగా ప్యాకింగ్ చేసి, వ్యాపార సరళిలో ఆదాయం ఆర్జిస్తున్నారు. మునగ ఔషధ గుణాలను ప్రజలు గుర్తిస్తున్నందున ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. కాబట్టి మునగ సాగు రైతులకు నేడు లాభదాయకంగానే ఉంటుంది.
Like this:
Like Loading...
Related