ఏంటీ … బెండకాయల వలన ఇన్ని ఉపయోగాలా … !!

ఏంటీ … బెండకాయల వలన ఎన్ని ఉపయోగాలా … !!
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటున్నామంటే అందులో బెండకాయ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ కూరగాయలను  చాలా మంది ఇష్టంగా తింటారు. కర్రీ, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా నచ్చిన రీతిలో చేసుకుని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వంటల సంగతి పక్కన బెడితే, బెండకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈ కధనంలో  తెలుసుకుందాం.
బరువు అదుపులో : బెండకాయలో ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధికంగా తినాలనే కోరికను అదుపులో ఉంచుతుందని, ఫలితంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. అలాగే బెండకాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందని వివరిస్తున్నారు. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
కెఫెన్ కు ప్రత్యామ్నాయంగా : బెండకాయ గింజలను వేయించి కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఈ సంప్రదాయం కాఫీ కొరత ఉన్న కాలం నుంచి, ముఖ్యంగా యుద్ధ సమయంలో ప్రారంభమైందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో కెఫెన్ లేనందున, కాల్చిన బెండకాయ గింజలు కాఫీ రుచిని కలిగిస్తుందని, కెఫెన్ వినియోగాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి బెండకాయ గింజలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని సూచిస్తున్నారు.
షుగర్‌ అదుపులో : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ప్రజలు డయాబెటిస్(Diabetes) బారిన పడుతున్నారు. అయితే షుగర్ పేషెంట్స్కు బెండకాయ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలోని ఇథనాలిక్తో పాటు ఓక్రా మ్యుసిలెజ్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్  పేర్కొంది.
ఎముకలు ఆరోగ్యంగా : బెండకాయలో విటమిన్ సి, కె, మెగ్నీషియం, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుదలకు, విటమిన్ కె ఎముకలు ధృడంగా ఉండేందుకు సహాయపడతాయని వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటివి వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.
గుండె జబ్బులు : బెండకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి దోహదపడుతుందని క్లివ్ ల్యాండ్ క్లినిక్ పేర్కొంది. అలాగే బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివరిస్తున్నారు.
బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది : ఎండాకాలంలో వేడి, ఉక్కపోత కారణంగా చెమట ద్వారా శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. అయితే బెండకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో మెగ్నీషియం వంటి పోషకాలు చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్ స్థాయిలను పెంచుతాయని వివరిస్తున్నారు.
గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top