
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- కూరలు అడుగంటకుండా, ఎక్కువ వేడి పై కాల్చేందుకు, నాన్ స్టిక్ పాన్లు ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా ఇవి శుభ్రం చేసుకునేందుకు సులువుగా, నూనె ఉపయోగం తక్కువ కారణంగా వీటికి ఆదరణ ఎక్కువే! అయితే, ఎక్కువ కాలం వాడిన, గీతలు పడిన వాటితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నాన్స్టిక్ పాన్ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి ప్రత్యామ్నాయంగా ఏ పాత్రలు ఉపయోగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
నాన్ స్టిక్ పాన్లకు టెఫ్లాన్ పూత పూస్తారు. ఆహారం అంటకుండా, వేడిని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. టెఫ్లాన్ నేరుగా క్యాన్సర్ కారకం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే టెఫ్లాన్ అనేది ‘పాలీ ఫ్లోరో ఆక్టానోయిక్ యాసిడ్’ (పీఎఫ్వోఏ)తో తయారవుతుందని, ఇది పెద్ద రసాయన సమూహం అంటున్నారు.పీఎఫ్వోఏతో టెఫ్లాన్ పాన్లు తయారు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని 2005లో యూఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గుర్తించింది. 2015 లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ దీనిపై పరిశోధించింది. పీఎఫ్వోఏ కాన్సినో జెనిక్ కాబట్టి, అది లేని టెఫ్లాన్ తయారు చేస్తే బాగుంటుందని నివేదికలిచ్చారు. 2014 నుంచి పీఎఫ్ వో ఏ వాడకం 60 శాతం తగ్గినట్లు అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంచనా వేసింది.
పీఎఫ్వోఏ ‘ఫ్రీ’ లేబుల్ ఉన్నవే : ప్రస్తుతం నాన్ స్టిక్ కొనుగోలు చేసేటప్పుడు ‘పీఎఫ్వోఏ ఫ్రీ’ అనే లేబుల్ పాన్లపై వేస్తున్నారు. వీటిని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాన్ లైనా 260 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా అత్యధిక వేడిలో వండినప్పుడు పాలీ ఫ్లోరో కార్బన్ అనే వాయువులు విడుదలై జ్వరం, దగ్గు, ఆయాసం, దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయని పరిశోధనల్లో తేలింది.
ప్రత్యామ్నాయంగా : కాస్ట్ ఐరన్ పాన్ ఉక్కుతో చేసినవి కావడం వల్ల శరీరానికి ఇనుము పోషకంగా లభిస్తుంది. ఎక్కువ కాలం సైతం మన్నుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, స్టెయిన్లెస్ స్టీల్ పాన్లో రసాయనాలు విడుదల కావని, ఆరోగ్యానికి సురక్షిమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇవి అధిక వేడిని తట్టుకుంటుందని, ఎక్కువ సురక్షితమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిరామిక్ కోటింగ్ పాన్లు కెమికల్ రహితంగా ఉంటాయని, ఇక మట్టిపాత్రలు, స్టోన్, బ్రాస్, కంచు వంటి సాంప్రదాయ పాత్రలు, పాన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వంటకానికి సహజ రుచినిస్తాయంటున్నారు.
గమనిక : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.