మనిషి ముఖాన్ని గుర్తుపట్టే కాకులు….!!
క్యాపిటల్ వాయిస్,ప్రత్యేక సమాచారం :-కాకులు ప్రత్యేకమైన జీవులు . ప్రజలు వాటిని ప్రత్యేక సందర్భాల్లో తలుచుకుంటూ ఉంటారు. కాకి ఇంటి మీద వాలి అరిస్తే చుట్టాలు వస్తారు అని అంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు వారు కాకుల రూపంలో వస్తాయని అంటారు. కాకులకు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకుని శక్తి ఎక్కువని  సైంటిస్టులు చెప్తున్నారు.శాస్త్రవేత్తల పరిశోధనలు వాటి అసాధారణ మేధస్సును ప్రపంచానికి పరిచయం చేశాయి.ప్రమాదకరమైన వ్యక్తుల గురించి ఇతర కాకులకు  తెలియజేస్తాయి. ఒకప్పుడు ఇలాంటి జ్ఞాపకశక్తి, సామాజిక అభ్యాసం మనుషులు, కోతులు వంటి ప్రైమేట్స్‌లో మాత్రమే ఉంటుందని భావించేవారు. కాకుల్లో కూడా ఈ సామర్థ్యాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ అంశంపై అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి  చెందిన ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లఫ్, ఆయన బృందం  కీలకమైన పరిశోధనలు చేశారు. అడవిలోని కాకులను పట్టుకుని వాటికి గుర్తింపు ట్యాగ్‌లు అమర్చే సమయంలో పరిశోధకులు ప్రత్యేకమైన మాస్కులు ధరించారు. ఈ ప్రక్రియలో కాకులకు భయానక అనుభవం ఎదురైంది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే మాస్కులు ధరించిన వ్యక్తులను చూసిన కాకులు వెంటనే గుర్తుపట్టాయి. గట్టిగా అరుస్తూ, గుంపుగా చేరి వారిని తరిమేందుకు ప్రయత్నించాయి. అంటే ఒకసారి ప్రమాదకరంగా భావించిన మనిషి ముఖాన్ని అవి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మరచిపోలేదని పరిశోధన వెల్లడించింది.
చిన్న కాకులు కూడా ఎలా గుర్తుపట్టాయి?
ఈ పరిశోధనలో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అసలు సంఘటన జరిగినప్పుడు ఇంకా  పుట్టని పసి కాకులు  కూడా అదే మాస్కులు చూసి పెద్ద కాకుల్లాగే హెచ్చరికలు చేస్తూ దాడి చేయడానికి ప్రయత్నించాయి. దీంతో ప్రమాదకరమైన వ్యక్తుల గురించి పెద్ద కాకులు చిన్న కాకులకు సమాచారం అందిస్తున్నాయని, ఒక తరం నుంచి మరో తరానికి ఆ సమాచారం చేరుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
మెదడు ఎలా పనిచేస్తుంది?
ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మెదడు స్కాన్లలో, పరిచయమైన మనుషుల ముఖాలను చూసినప్పుడు కాకుల మెదడులో దృశ్య గుర్తింపు, భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగాలు చురుకుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.  ఈ విధానం కొన్ని పాలిచ్చి పెంచే  జంతువులలో కనిపించే మెదడు పనితీరుతో పోలి ఉంటుందని వారు చెప్పారు.
ముఖాలు గుర్తుపట్టడమే కాదు…!!
కాకులు కార్విడ్ అనే పక్షుల కుటుంబానికి చెందినవి. ఈ కుటుంబంలో రావెన్లు, మ్యాగ్‌పైలు కూడా ఉంటాయి. కాకులు కేవలం ముఖాలు గుర్తుపట్టడం మాత్రమే కాదు..వ్యక్తులను వేర్వేరుగా గుర్తించగలవు. గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రమాదాలను అంచనా వేస్తాయి. సమస్యలను పరిష్కరించగలవు. ఒక కాకి నేర్చుకున్న విషయాన్ని ఇతర కాకులకు తెలియజేస్తాయి. నగరాల్లో, అడవుల్లో జీవించడానికి ఈ తెలివితేటలు వాటికి ఎంతో ఉపయోగపడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మర్డర్ ఆఫ్ క్రోస్’ అంటే నిజంగా హత్యేనా?
కాకుల గుంపును ఇంగ్లీష్‌లో ‘A Murder of Crows’ అని పిలుస్తారు.ఈ పేరు వింటే భయంగా అనిపించినా, దీనికి శాస్త్రంతో సంబంధం లేదు. ఇది మధ్యయుగ ఇంగ్లీష్ జానపద సంప్రదాయంలో పుట్టిన పేరు మాత్రమే. ఆ కాలంలో యుద్ధభూములు, ఉరిశిక్షలు జరిగిన ప్రాంతాలు, మృతదేహాల దగ్గర కాకులు ఎక్కువగా కనిపించేవి. వాటి నల్లని రంగు, కర్కశమైన కూత, మృతజంతువులను తినే అలవాటు వల్ల యూరోపియన్ జానపద కథల్లో కాకులను మరణానికి ప్రతీకగా భావించేవారు. అందుకే వాటి గుంపుకు ‘మర్డర్ ఆఫ్ క్రోస్’ అనే పేరు వచ్చింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ప్రస్తుతం కాకుల గుంపును సాధారణంగా ‘ఫ్లాక్ అని పిలుస్తున్నారు.

ఎడిటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *