ఆకాశంలో అద్భుతం….. ఒకే లైన్లోకి 7 గ్రహాలు

ఆకాశంలో అద్భుతం – ఒకే లైన్లోకి 7 గ్రహాలు
 # టెలిస్కోప్ లేకుండానే చూసే అవకాశం 
క్యాపిటల్ వాయిస్, అంతరిక్ష సమాచారం :- ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం త్వరలో కనువిందు చేయనుంది. టెలిస్కోప్ లేకుండానే ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రానుంది. వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. ‘ప్లానెట్ పరేడ్’గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం కానుంది. అయితే అంతకంటే ముందే జనవరిలోనే భారత దేశంలో ఈ ప్లానెట్ పరేడ్ను చూడొచ్చు. కానీ అప్పుడు ఆరు గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి.
ఈ ప్లానెట్ పరేడ్లో శుక్రడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్- ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా, భారత దేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరు. ఇది జనవరి 21 నుంచి 31 వరకు ఉంటుంది. కానీ జనవరి 25 మాత్రం మరింత దగ్గరగా కనిపిస్తుంది. రాత్రి సమయంలో వీటిని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలను లేకుండానే చూడొచ్చు. కానీ నెప్ట్యూన్, యురేనస్ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటం సాధ్యం అవుతుంది.
ముందుగా జనవరి 19న శుక్రుడు, శని గ్రహాలు ఒక వరుసలోకి వస్తాయి. ఆ తర్వాత జనవరి 21న సాయంత్రం శుక్రుడు బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలోకి వస్తాయి. ఫిబ్రవరి 28న బుధుడు శుక్రడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. ఇలా ఏడు గ్రహాలు కనిపించే ప్లానెట్ పరేడ్ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దృశ్యం చివరిసారిగా 2022లో ఆవిష్కృతం అయింది. ఈ ప్లానెట్ పరేడ్ కనిపించేది రాత్రి సమయంలో కొద్ది సేపు మాత్రమే. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి చూడొచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top