క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక కధనం :- లబో మారేలే, మండ్రామ్జి మారే ఐలేజి గమ్ రోయి పుర్ బాన్ నమీ ఆ గుర్తు బెన్ జి…’ అంటే… సవర భాషలో నేల మారిపోయింది,మనుషులు మారి పోయారు అయినా మా పూర్వీకుల పంటలు ,ఇపుడు పండిస్తున్నాం.’ అని,రాగుల పొలంలో కలుపు తీస్తూ మాతో సంతోషంగా చెప్పారు. అక్కడి సవర గిరిజనులు.ఈ ఊరి రైతులు యూరియా వాడరు. ఊరంతా వెతికినా ఎక్కడా ఒక్క ఎరువుల షాపు కూడా కనపడదు. ఒక్క యూరియా గుళిక వాడ కుండా 95 ఎకరాల్లో వరి , రాగులు, సజ్జలు , కూరగాయలు పండిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో యూరియా లేకుండా పంటలు పండించ వచ్చునా?
దిగుబడులు పెరుగతాయా? రైతులకు నష్టం రాదా? అని రైతులను అడిగితే ఖచ్చితంగా పండించ వచ్చు, దిగుబడులు సాధించ వచ్చంటున్నారు.ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మారుమూల ఆది వాసీ పల్లె అది.ఇక్కడి ప్రజలు ఐక్యతా, పర్యావరణ హిత ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్చంగా మార్చింది. ఇప్పుడు యూరియా కొరత ఉంది కదా అని, రసాయన ఎరువులు వాడే పొలాల్లో వెంటనే జీవన ఎరువులు వేస్తే ఉపయోగం ఉండదు. రసాయన ఎరువులకు అలవాటు పడిన భూమిని సేంద్రియ సాగుకు మళ్లించడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. ముందుగా చెరువు మట్టితో కప్పాలి. తరువాత నవధాన్యాలు పండిరచి, భూమిలో కలియ దున్నాలి. తరువాత జీవన ఎరువులు వాడుతూ సాగు చేయాలి. క్రమంగా ఫలితాలు వస్తాయి.’ అంటారు జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకుడు పారినాయుడు.
కొండల మధ్య కొలువైన కుగ్రామం
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలంలో పెదకొండ, తోటకొండ, తివ్వకొండల మధ్య ఉన్నదే కొండబారిడి. అక్కడ వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. అక్కడి 70 కుటుంబాల్లో అందరూ రైతులే. ఒకపుడు వీరికి రసాయన ఎరువులంటే తెలీదు కానీ, అధిక దిగుబడుల కోసం, మైదాన ప్రాంత రైతుల సాగును చూసి, వారి ప్రభావంతో యూరియా, డిఎపీ, సూపర్ పాస్పేట్,పొటాష్ వంట రసాయన ఎరువులకు అలవాటు పడి అప్పుల పాలవ్వసాగారు.ఈ పరిస్థితుల్లో వారి మధ్యకు ‘జట్టు ట్రస్ట్’ వచ్చింది. 2017లో 95 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. దీని వెనుక, ‘జట్టు ట్రస్ట్’ వ్యవస్థాపకుడు డి. పారినాయుడు కృషి ఉంది. కొంతకాలం ప్రభుత్వ టీచర్ గా పని చేసి, ఉద్యోగం వదిలేసి, గిరిజనులందరినీ ఒక జట్టుగా మార్చి కొండబారిడి గ్రామాన్ని ప్రకృతి సాగుకు ప్రయోగ శాలగా మార్చారాయన.రైతమ్మల భాగస్వామ్యంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకున్నారు. పశువుల పేడలో ఘన జీవామృతాన్ని తయారు చేసి చివరి దుక్కిలో పంట కాపు దశలో వినియోగిస్తారు.
‘పుల్లని మజ్జిగను చీడపీడలను నివారించేందుకు పంటలకు పిచికారి చేస్తాం మొదట్లో దీన్ని శ్రీవరికి మాత్రమే ఉపయోగించినా ఇపుడు అన్ని పంటలకు వేస్తున్నాం.. మాకు ఎనిమిది మహిళా సంఘాలున్నాయి. సాగుకు ముందు, మేమంతా జీవామృతం తయారు చేసి విత్తన శుద్ధి చేస్తాం. ‘జట్టు ట్రస్టు’ ఇచ్చిన శిక్షణలో ఇంగువ ద్రావణం, తూడికాడ కషాయం తయారు చేసి, చీడ పీడలను నివారించడం నేర్చుకున్నాం. మా ఇళ్లలో మంచినీళ్ల కుండలున్నట్టే, ప్రతీ పొలం దగ్గర ద్రవ జీవామృతం నింపిన డ్రమ్ములుంటాయి.’ అంటారు ఊరి సర్పంచ్ బిడ్డిక మంజువాణి.
ఎకరానికి రెండు కిలోల విత్తనాలే..!!
” ఇంతకు ముందు రసాయన ఎరువులు వాడితే. ఎకరానికి 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చేది. అయితే తొలిసారిగా శ్రీవరి పద్ధతిలో వరి సాగు చేసి, సేంద్రియ ఎరువులు వాడితే, 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. నా పొలమేనా అని ఆశ్యర్యపోయాను. గతంలో ఎకరాకు 30కిలోల విత్తనం వాడితే, శ్రీవరి పద్ధతిలో కేవలం 2కిలోల విత్తనాలే సరిపోయాయి.తాడుతో వరుసలు వేసుకొని, ప్రతీ దుబ్బుకు అడుగు దూరం ఉండేలా నాట్లు వేశాం. దీని వల్ల గాలి, ఎండ బాగా సోకుతాయి. తెగులు రావు.” అంటారు 80 ఏండ్ల వయస్సులో కూడా వంగి విత్తనాలు నాటుతున్న పత్తిక పర్సయ్య .వరి మాత్రమే కాదు, పోడు సాగులో జీడి, రాగులు, సజ్జలు వంటి పంటల సాగులో వీరు ప్రకృతి వ్యవసాయ విధానాలే అనుసరిస్తున్నారు.
గ్రామస్తులకు ఈ సాగు పద్ధతి మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ విధానాలతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా నేల కాలుష్యాన్నీ తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఎరువుల తయారీకి కావాల్సిన పశు వ్యర్ధాల కోసం ప్రతి ఇంట్లో ఆవులో, గేదెలో, గొర్రెలో తప్పకుండా పెంచుకుంటున్నారు. సైకిల్ వీడర్లతో కలుపును తీసి, దానిని మట్టిలో కలిపేసి ఎరువుగా తయారు చేస్తున్నారు, ఇది పంటకు బలాన్నిస్తుంది.
” ఇపుడంటే మిల్లులు వచ్చాయి కానీ, ఒకపుడు ధాన్యాన్ని మేమే దంచుకొని బియ్యం వండుకునే వాళ్లం. ఈ పూట వండిన అన్నం గంజిలో వేసుకుంటే మర్నాటి వరకు చెక్కు చెదిరేది కాదు. దానినే చద్దన్నంగా పొలానికి పట్టుకు పోయి తినే వాళ్లం. ఇపుడు మళ్లీ ఆరోజులొచ్చాయి. దంపుడు బియ్యం తయారు చేస్తున్నందుకు 30 మందికి ఉపాధి కలిగింది. తిరగలితో పిండిని చేసుకుంటూ, వడ్లు ఎవరికివారు దంచుకుంటే శరీరానికి, ఆరోగ్యానికి మంచిది ” అంటోంది గ్రామైక్యసంఘ అధ్యక్షులు పత్తిక సుశీల.భూమిలేని పేదలకు ఉపాధి కోసం, దంపుడు బియ్యం తయారీ కేంద్రం నిర్మాణంలో ఉంది.నీమాస్త్రం,బ్రహ్మాస్త్రం వంటి కషాయాలు నామమాత్రపు ధరకు విక్రయించడానికి అక్కడే ఒక విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు.
సాగు’బడి’ పాఠాలు… !!
ఈ ఊరి స్కూల్ విద్యార్థులకు కూడా మొక్కల పెంపకం పై అవగాహన కల్గిస్తున్నారు. పంటలకు ఉపయోగ పడే మిత్రకీటకాల గురించి కథల రూపంలో పుస్తకాలను ప్రచురించి పంచుతున్నారు. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో సాగు చేయించి, పండిన కూరగాయలను వారి మధ్యాహ్న భోజనంలో వంటకు వాడుతున్నారు. ప్రకృతి సాగు పై పది పుస్తకాలు ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేస్తున్నారు.భూమిలేని పేదలకు ఉపాధి కోసం, దంపుడు బియ్యం తయారీ కేంద్రం నిర్మాణంలో ఉంది.నీమాస్త్రం,బ్రహ్మాస్త్రం వంటి కషాయాలు నామమాత్రపు ధరకు విక్రయించడానికి అక్కడే ఒక విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు.
రెండు వందల సేంద్రియ గ్రామాలు… !!
‘ మహిళా పొదుపు సంఘాలను రైతు సంఘంగా అభివృద్ధి పరిచారు. విత్తనాల ఉత్పత్తి, సాగు పద్ధతిలో రైతులకు అవగాహన కల్పించాలి. మా జట్టు ట్రస్టు ప్రధాన ఉద్దేశం ఇవే. తమ ఊరిని మార్చడానికి, సవర గిరిజనులు ముందుకొచ్చి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. పది మందితో మొదలై, వందమంది సభ్యులయ్యారు ఒక గ్రామంతో మొదలై రెండు వందల సేంద్రియ గ్రామాలు రూపొందుతున్నాయి.’ అంటారు ఈ మార్పుకు దోహద పడిన జట్టు ట్రస్టు వ్వవస్థాపకుడు, డి.పారినాయుడు. ఒకప్పటి రసాయన ఎరువులతో సారం కోల్పోయిన భూమిని ప్రకృతి సాగు లోకి తేవడానికి చాలా శ్రమించారు.వెనుకబడిన ప్రాంతమనీ, అక్షరాస్యత లేదనీ, అవకాశాలు తక్కువనీ నిరుత్సాహ పడకుండా తమకాళ్లపై తాము నిలబడి, యూరియాను తమ గ్రామం నుండి తరిమేసి, సహజ సాగుకు కొత్త అర్థాన్ని చెప్పారు. కొండబారిడి గ్రామాన్ని తొలి జెడ్ బి ఎన్ ఎఫ్ (జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్) గ్రామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.