పాలలో  కల్తీ ని కనిపెడదాం .. ఇలా !!

పాలలో  కల్తీ ని కనిపెడదాం .. ఇలా !!
క్యాపిటల్ వాయిస్, వినియోగ సమాచారం :- రాశి పరంగా ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో భారత్ ఉన్నా, వాసి పరంగా ఎగుమతి స్థాయిలో పాలు, పాల ఉత్పత్తులు ఆశించినంత మేరగా లేకపోవడం మన దురదృష్టం. పరిశుభ్రమైన పాల ఉత్పత్తి పై గత 50 సంవత్సరాలుగా రైతులకు చేస్తున్న అవగాహన ఇంకా క్షేత్ర స్థాయిలో అమలు కాని స్థితి లోనే ఉంది.దీనివల్ల మన పాలు, పాల ఉత్పత్తుల్లో తాజాదనం లేకపోవడం, సూక్ష్మజీవుల పరంగా నాణ్యత ప్రమాణాలకు సుదూరంగా ఉండటం జరుగుతుంది. దీనికి తోడు మానవుడు తన స్వార్థ చింతనతో చేస్తున్న కల్తీ, కృత్రిమ పాల తయారీ లాంటి విపరీత పోకడలు, పోషకాల గని  అయిన పాల నాణ్యత పై సవాళ్లు విసురుతున్నాయి.
పాలకల్తీకి  ప్రధాన కారణాలు: 
పాలను ఎక్కువకాలం నిల్వ ఉంచడం కోసం, పాల ఘనపరిమాణం పెంచడం అనే ప్రధాన కారణాలు పాల కల్తీకి దారితీస్తుంది. అంతేకాక పాల సాంద్రత పెంచడం కోసం కూడా కల్తీ జరుగుతోంది.
ల్తీని గుర్తించే అడల్ట్రేషన్ కిట్:
ముఖ్యంగా పాలలో కలిపే నీటిని లాక్టోమీటర్ తో గుర్తించవచ్చు. కానీ కలిపే నీరు శుభ్రమైనవి కాకపోతే ఆ పాలు ఈ. కొలీ లాంటి వైరస్ కలిగి అనర్థాలు చేకూరుస్తాయి. ఇక పోతే పాల గాడత పెంచడానికి వాడే పాలపొడి, సబ్బు, పిండి,శాకరిన్, ఉప్పు, యూరియా లాంటివెన్నో కలుపుతుంటారు. వీటన్నింటిని గుర్తించడానికి ఎన్ డి డి బి రూపొందించిన అడల్ట్రేషన్ కిట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అంతేకాక పాల ఉత్పత్తులైన నెయ్యిలో డాల్డా తో,పన్నీర్ లో పిండి తోను కల్తి జరుగుతుంది. నలగగొట్టిన బంగాళాదుంపలు కూడా కల్తీకి ఉపయోగిస్తారు. పాల నిల్వ పెంచడానికి కలిపే సోడాలు కూడా దీర్ఘకాలం వాడుకతో జీర్ణకోశం పై ప్రభావం చూపుతుంది. బోరిక్ యాసిడ్, ఫార్మాలిన్ కూడా ఈ కోవకు చెందినవే.హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపినా అంత హానికరం కాదు.యూరియా, సోడియం హైడ్రాక్సైడ్, వెజిటేబుల్ ఆయిల్, కొన్ని రకాలైన డిటర్జెంట్లు, పాలపొడి, ఉప్పు, నీటితో కృత్రిమ పాల తయారీలో కొందరు సిద్ధస్తులయ్యారు. ఒక లీటరు కృత్రిమ పాల తయారీకి గరిష్టంగా 20 రూపాయలు కాగా బహిరంగ మార్కెట్లో వాటిని మంచి పాలలో కలిపి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ వారి ఆరోగ్యం తో ఆడుకుంటున్నారు. పాలను కల్తీ చేయడం శిక్షార్హం అమలులో ఉన్న ఎఫ్.ఎస్.ఎస్. ఏ.ఐ. చట్టం ప్రకారం నేడు పాల ఉత్పత్తి అయ్యే డెయిరీ ఫారాలకు కూడా ప్రామాణిక తయారీ పద్ధతులు ఎస్.ఓ.పి అమల్లోకి వచ్చాయి.

పరిశుభ్రమైన పాలతో ఆరోగ్యం…!!
ఆరోగ్యవంతమైన పాడి పశువు నుంచి ఆరోగ్యవంతమైన పరిసరాల్లో, శుభ్రమైన పాత్రల్లో, ఆరోగ్యవంతుడు పాలను పిండినప్పుడే దానిని పరిశుభ్రమైన పాల ఉత్పత్తి విధానం గా పేర్కొనవచ్చు. ఇలాంటి పాలతోనే తాజాదనం ఉట్టిపడే పాల ఉత్పత్తుల తయారీ వీలు పడుతుంది. చాలావరకు గ్రామస్థాయిలో పాల పరీక్ష పరికరాలను పెట్టి, రైతుల వివరాలు కలిగివున్న సహకార డెయిరీల పాలు సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పాలతోనే శిశువులు, వృద్ధులు, మహిళలు, ఆటగాళ్లు, ఆరోగ్యం పొందవచ్చు.కల్తీ చేయని పాలను కాస్త ఎక్కువ ధర అయినా వినియోగదారునికి చేర్చాలని రైతు ద్యేయం అయినప్పుడే ఆరోగ్య భారతావనికి ఉషోదయం అవుతుంది. ఇలాంటి పరిశుభ్రమైన పాల ఉత్పత్తిదారులకు బ్యాక్టీరియా శాతం పరంగా భద్రంగా ఉన్న పాలకు, ప్రోత్సాహకాలుగా ఎక్కువ ధర చెల్లించాలి. ఈ బాధ్యత డైరీలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(సేకరణ : మధుసూదనరావు,ఉపసంచాలకులు,విజయ డెయిరీ,ఆదిలాబాద్, ఫోన్: 9121160553).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top