పగ… ప్రతీకారాలే పల్నాటి పోరు
మహాభారతాన్ని పోలిన పల్నాటి యుద్ధం…
(క్యాపిటల్ వాయిస్, కారంపూడి):- పదవీ వ్యామోహం దాయాదుల వైరం శైవ, వైష్ణవ సంఘర్షణల నేపథ్యంలో క్రీ.శ 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటి చరిత్ర కు ఓ విశిష్టత ఉంది. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు గతించారు. ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్ధం మాత్రం నేటికీ పల్నాటి ప్రజల హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆనాటి యుద్ధంలో అసువులు బాసిన వీర నాయకుల గుండెచప్పుళ్ళు ఇప్పటికీ వినబడుతూనే ఉన్నాయి. ఇక్కడ జరిగే వీరారాధన ఉత్సవలలో కత్తులు నర్తిస్థాయి. పల్నాటి కథకు ఉద్యమంగా ఆలపిస్తారు. ఇక్కడ ఏ రాయిని చూసినా పల్నాటి పౌరుషం కళ్ళకు కట్టినట్లు సాక్షాత్కరిస్తుంది.
పల్నాటి యుద్ధం కీలక ఘట్టం…!!
ఆంధ్రదేశంలోని పల్నాడు ప్రాంతములో క్రీ.శ. 1182లో పల్నాటి యుద్ధం జరిగింది. మహాభారతంకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అందుకే ఆంధ్ర భారతం అని కూడా పల్నాటి యుద్ధం గురించి చెబుతారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. క్రీ.శ.1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం శైవులు, వైష్ణవుల మధ్య జరిగింది. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు.

బ్రహ్మనాయుడు – నాగమ్మల మధ్య విరోధమే యుద్ధానికి నాంది !!
పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన వారు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ. ఇద్దరూ ఇరు రాజ్యాల్లో మంత్రులే. బ్రహ్మనాయుడు మాచర్లను పాలించిన మలిదేవరాజు వద్ద, నాగమ్మ గురజాలను పాలించిన నలగాముని వద్ద మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే. బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు. నాగమ్మ శివ భక్తురాలు. అనాదిగా శివ, వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది. బ్రహ్మనాయుడు కారంపూడి , మార్కాపురం, మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. నాగమ్మ శివ క్షేత్రాలను నిర్మించింది.బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం కల్పించారు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. మాల కన్నమదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా చేశాడు. అయితే నాగమ్మకు ఇది ఇష్టం లేదు. అగ్రవర్ణాలలో అధిక భాగం నాగమ్మ చెంతన చేరటంతో అటో ఇటో తేల్చుకోవాలనుకున్నారు. చివరికి కోడి పోరుకు సిద్ధమయ్యారు.
ఏడేళ్ల తరవాత రాజ్యం అప్పగంచని నాగమ్మ – యుద్ధం అనివార్యం !!
కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు, మలిదేవులతో కలిసి ఏడేళ్లు అరణ్యవాసంకు వెళతారు. నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఏడు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాత తన రాజ్యం తనకిమ్మని బ్రహ్మనాయుడు కబురు పంపుతాడు. అయితే నాగమ్మ అంగీకరించదు. పైగా దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చర్లగుడిపాడు వద్ద రహస్యంగా చంపిస్తుంది. యుద్ధమే ఇక రాజ్యాన్ని రాబట్టుకోవడానికి మార్గమని నమ్మి సిద్ధమవుతారు. కారంపూడిని యుద్ధక్షేత్రంగా ఖరారు చేశారు. అందుకే చరిత్ర పుటల్లో కారంపూడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే యుద్ధంలో చనిపోతున్న వారిని చూసి బ్రహ్మనాయుడు మనసు చలించింది. యుద్ధంలో ఓటమిని అంగీకరించి చనిపోయిన 66మంది వీర నాయకులకు లింగ ప్రతిష్టచేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారిని వంశ పారంపార్యంగా ఏర్పరచి గుత్తికొండ బిలానికి తపస్సుకై వెళ్లిపోయాడు. నాగమ్మ కూడా యుద్ధానంతరం మనసు మార్చుకొని చేసిన తప్పిదం గుర్తించి ఆధ్యాత్మికంగా పయనించింది. ఇలా జరిగిన పల్నాటి యుద్ధంలో మృతిచెందిన వీరుల ఆత్మలు కార్తీక అమావాస్యనుండి ఐదురోజుల పాటు కారంపూడిలోని మరుభూమిలో అదృశ్యంగా విలపిస్తుంటాయని నమ్ముతూంటారు.

కారంపూడి యుద్దానికి సజీవ సాక్ష్యం…!!
తొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వం నాయకురాలు నాగమ్మకు, బ్రహ్మనాయుని వర్గాలకు మధ్య జరిగిన భీకర పోరాటం గుర్తులు నేటికీ చెదిరిపోలేదు. నాటి రాజులు వాడిన కత్తులు వారి గుర్తుగా నాటిన వీర నాయకుల శిలలు కారంపూడి లోనే పీర్ల దేవాలయంలో పల్నాటి చరిత్రకు సజీవ సాక్షులుగా పర్యాటకులను అలరిస్తు ఉన్నాయి. పల్నాటి రాజ్యాన్ని అనుగురాజు పాలిస్తున్న రోజుల్లో ఒకసారి కారడవిలో నాగమ్మ ఆదిత్యన్ని స్వీకరించి సంతృప్తి చెందిన అనుగురాజు నాగమ్మకు కొద్ది కాలపు రాజ్యాధికారాన్ని వరంగా ఇవ్వటంతో పల్నాటి చరిత్రకు అంకురార్పణ జరిగింది. అనుగురాజు గతించి బ్రహ్మనాయుడు మంత్రిగా నలగామరాజు వద్ద పరిపాలన బాధ్యతలు స్వీకరించిన సమయంలో తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నాగమ్మ కోరటంతో విధిలేని పరిస్థితులలో నలగాముడు నాగమ్మకు రాజ్యాధికారం అప్పగించాడు. దీంతో దాయాదుల వైరానికి తెరతీసింది. నాగమ్మ తనకు ప్రాప్తించిన విశేష అధికారంతో బ్రహ్మనాయుడుని దోషిగా చిత్రీకరించి మలిదేవరాజు ను కారాగారంలో వేయించడంతో బ్రహ్మనాయుడు వారిని విడిపించి మాచర్ల రాజ్యం ఏర్పాటు చేసి మలి దేవాదుల పేరుతో బ్రహ్మనాయుడు సుభిక్షంగా పాలన చేస్తుంటాడు. దీంతో కన్ను కుట్టిన నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతోంది. నాగమ్మ చెప్పుడు మాటలు విని ఆమె చేతిలో నలగామరాజు కీలుబొమ్మల అవుతాడు. కుతంత్రం తో బ్రహ్మనాయుని, మలిదేవరాజును అడవులకు పంపిస్తుంది నాగమ్మ. నిర్ణీత కాలం పిమ్మట తమ రాజ్యాన్ని అప్పగించమని బ్రహ్మన్న చేసిన విజ్ఞప్తిని మన్నించక దూతగా వచ్చిన అలరాజునీ చంపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధం అనివార్యమని మలిదేవరాజు తరపున యుద్ధం చేస్తాడు. యుద్ధంలో చావుతప్పి కన్నులొట్టబోయి చేతికి దొరికిన నాయకురాలు నాగమ్మకు స్త్రీ అనే కారణంగా ప్రాణభిక్ష పెట్టడంతో నాగమ్మ పారిపోతుంది. యోధాను యోధులైన రాజులందరూ మరణిస్తారు. కన్నమదాసు, బాలచంద్రుడు, మలి దేవరాజులు యుద్ధంలో వీరమరణం చెందుతారు. దీంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు రాజ్యాన్ని నలగామరాజు కు అప్పగించి గుత్తికొండ బిలం లోనికి తపస్సుకై వెళ్లడంతో పల్నాటి యుద్ధం ముగుస్తుంది. ఆనాటి యుద్ధ విశేషాలను పల్నాటి వీరరాధన ఉత్సవాల పేరుతో ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలోనీ 11 జిల్లాల నుండి వీరాచార వంతులు, కన్నమనీడులు పిన్న పెద్దలు, ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ల ఏర్పాట్లను,తిధులను బట్టి ఆ సమయాన్ని పల్నాటి వీరరాదనా ఉత్సవాలు నిర్వహించడానికి పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు, పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్ లు నిర్ధారించి ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి సమాచారాన్ని ఇస్తారు.

ఆ ఐదు రోజులు ఇలా ఉంటాయి….
1. రాచగావు;: పోతురాజు కు మేకపోతు నైవేద్యం సమర్పించడంతో ఉత్సవాలలో మొదటి రోజైన రాచగావు ప్రారంభమవుతుంది. మేకపోతు మెడకు గావు పెట్టించడం తో రాచాగావు ప్రారంభం. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వీరాచార వంతులు తమ ఆయుధాలు (కొణతములు) నాగులేరు (గంగదారి మడుగు) స్నాన మాచరిస్తారు. ఈ కథా గానాన్ని వీర్ల దేవాలయంలో ఆలపిస్తారు.
2. రాయబారం;: అరణ్యవాసనంతరం తమ మాచర్ల రాజ్యాన్ని తమకు అప్పగించాలని బ్రహ్మన్న, మలిదేవదులు నాగమ్మ, నలగామరాజుల వద్దకు అలరాజును రాయబారిగా పంపడమే రాయబారం.
3. మందపోరు;: బ్రహ్మన్న, మల్లి దేవాదులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి గోసంపద ను నాగమ్మ వర్గీయులు తరలించగా పోవడమే మందపోరు. ఈ పోరులో కన్నమదాసు విశేష ధైర్యసాహసాలు ప్రదర్శించి గోసంపద రక్షిస్తారు. నాగమ్మ వర్గీయులను హత మారుస్తారు.
4. “కోడిపోరు“: పల్నాటి వీరారాధన ఉత్సవాలలో ముఖ్య ఘట్టం కోడిపోరు. పాడిపంటలతో తులతూగుతున్న బ్రహ్మనాయుని మాచర్ల రాజ్యాన్ని కైవసం చేసుకునేందుకు నాగమ్మ జరిపిన కుట్రయే కోడిపోరు. ఈ పందెంలో మాయ చేసి గెలిచిన నాగమ్మ బ్రహ్మన్న వర్గాన్ని మండాది అడవులకు పంపిస్తుంది. పాలవాయి గేటు దగ్గర కోడేరు గుట్టలలో ఈ పందెం జరుగుతుంది.
5. కల్లిపాడు;: కల్లిపాడు ఉదయాన్నే పూజారులు లంకన్నను ప్రాణం లేని ఒక వ్యక్తిగా ఒక విద్యావంతుని తయారుచేసి ఒకచోట పడుకో బెట్ట గా పీఠాధిపతి వచ్చి లంకన్నకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. సాయంత్రం దైవాలు అలంకరణ చేసి గంగదారి మడుగులో స్నానమాచరించి శంకుతీర్థ మండపంలో పీఠాధిపతి వద్దకు వచ్చి తీర్థం తీసుకుని కల్లిత్వరణం ద్వారా యుద్ధభూమి కి వెళ్లి పోతురాజు గుట్టపై ఉన్న కల్లితంగేడ మండలపై వరగడంతో పల్నాటి వీరారాధన ఉత్సవాలు ముగుస్తాయి. .
Like this:
Like Loading...
Related