ఆన్ లైన్ గేమింగ్ లతో కుదేలవుతున్న బాల్యం !!

ఆన్ లైన్ గేమింగ్ లతో కుదేలవుతున్న బాల్యం !!
ఆన్ లైన్ గేమింగ్ లతో కుదేలవుతున్న బాల్యం !!
క్యాపిటల్ వాయిస్, ప్రజాహితం :-విస్తృత రూపంలో సమాజమే, సూక్ష్మ రూపంలో బడి. ఆ తరగతి గది రేపటి పరిపూర్ణ వ్యక్తిత్వం గల పౌర సమాజాన్ని తయారుచేసే విజ్ఞాన కర్మాగారం. ఇల్లు-బడి బాల్యానికి బంగారు భవిష్యత్తును అందించే కేంద్రాలు. ఇంట్లో, బడిలో,సమాజంలో ఆధునిక పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నూతన టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగమూ చేసుకోవచ్చు. పిల్లలు మొబైల్‌ ఫోన్ల మాయ(వల)లో పడి తమ విలువైన కాలాన్ని, సహజ మేధస్సుతో ఆలోచించే స్పృహను కోల్పోతున్నారు. అంతేకాదు? యువత, పెద్దలు, ఆడ, మగ, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆధునిక పరికరాల వినియోగం శృతిమించడంతో సమాజం మానసిక సమస్యలతో అనారోగ్యం పాలవుతుంది. పిల్లలను చదువు నుండి, కుటుంబం నుండి దూరం చేస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ల ను కట్టడి చేయకపోతే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.పిల్లలు ఫోన్‌ ఉంటేనే అన్నం తింటారు. చెప్పిన మాట వింటారు, దాన్ని చూస్తూనే తింటారు. ఆన్‌లైన్‌లో ఆడుతూనే గంటలకు గంటలు గడిపేస్తుంటారు.లేదంటే ఏడుస్తుంటారు. చివరికి ఆ ఏడుపు ఆపాలన్నా ఫోను తోనే సాధ్యం అనే స్థాయికి నేటి పిల్లల పరిస్థితి దిగజారింది. చదువుతో సంబంధం లేకుండా అందరూ దీని బాధ్యులే, బాధితులే. ఈ ఆధునిక మానసిక దౌర్భాగ్యంతో పిల్లలు సహజ మేధస్సుతో ఆలోచించే సృజనాత్మకత, వినూత్నత కోల్పోతున్నారు. పిల్లలు ఫోనే లోకం, ఆన్‌లైన్‌ ఆట లేనిదే పూట గడువదనేలా తయారయ్యారు. ఆన్‌లైన్‌ గేములలో తుపాకులతో కాల్చేసే విధ్వంసకరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి.కొట్టుకోవడం, చంపుకోవడమే లక్ష్యంగా ఉండే ఆటల మూలంగా ఆ చిన్నారుల మనసులు ప్రతికూల ఆలోచనలతో నిండిపోతున్నాయి. పబ్జీ, బ్లూవెల్‌ లాంటివైతే మరణాలకు కారణమవుతున్నాయి. ఇలా ఫోన్లకు బానిసైన పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. మితి మీరి ఫోన్లకు బానిసలైన వారంతా పెద్దయ్యాక బెట్టింగు, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతారనే నిపుణుల సూచనలను

తల్లిదండ్రులు, ప్రభుత్వాలు పట్టించుకొని తక్షణమే ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. దీనికి బానిసలుగా పిల్లలు, యువకులు,పెద్దలు, వఅద్ధులు అనే తేడా లేకుండా ఫోన్‌ వినియోగం పెరిగిపోయి సమాజం గాడి తప్పుతుంది. చదువుకున్న (రాని)వారు అనే తేడా లేనే లేదు, ఫోన్‌ అతిగా వాడడం వల్ల జరిగే దుష్పరిణామాలు తెలిసిన వారు కూడా ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వేధింపుల నుండి పిల్లల్ని దూరం చేయలేకపోతున్నారు. విపరీతమైన ఫోన్‌ వాడకంతో రేపటి భావితరం ”మానసిక, శారీరక సమస్యల పౌర సమాజం”గా పరిణమించనుంది. ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆటాడేస్తున్న ఆన్లైన్‌ గేమ్‌ లను సమూలంగా కట్టడి చేయాలి.ఆన్‌లైన్‌గేమింగ్‌..చిన్నారులపై ప్రభావం
చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవస్థను నిషేధించినట్లు తెలుస్తోంది. పలుదేశాలు ఈ వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణపై అధ్యయనం చేసి పొంచి ఉన్న తీవ్ర పరిణామాల నుండి బయటపడేయటానికి మన దేశం లోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొఫెసర్లను నియమించింది. తమిళనాడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ (టీఎన్‌ఓజీఏ)ఈ సంస్థ దీని ప్రభావం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది, కట్టడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీని ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌ మీద నియంత్రణ కోసం పోరాడు తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన ప్రాథమిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాఠశాలలు, కళాశాలలలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా వారిలో 20శాతం మంది ఆన్‌లైన్‌ గేములకు, సామాజిక మాధ్యమాలకు బానిసలు అయ్యారని తెలిసింది. సర్వే కోసం పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు,యాజమాన్యాల సహకారం తీసుకున్నారు.ఆన్‌లైన్‌ గేములకు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థులకు కంటిచూపు సమస్యలు వచ్చాయని 67 శాతం మంది ఉపాధ్యాయు(అధ్యాపకు)లు చెప్పారు. బానిసైన విద్యార్థుల తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74 శాతం మంది వెల్లడించారు. ఈ అధికారులు
నిర్వహించిన సర్వేలో ప్రత్యేకించి ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం విద్యార్థుల్లో గత ఐదేండ్లుగా ఎక్కువవుతూ వస్తోందని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుందని చెబుతున్నారు.తల్లిదండ్రులు, ప్రభుత్వాల బాధ్యత విద్యార్థుల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం విచ్చల విడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వారి ప్రస్తుత దినచర్యపై ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు వచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాల్సి వుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి బాధ్యతతో వెంటనే నియంత్రణా చర్యలు చేపట్టాలి. ఆధునిక టెక్నాలజీ పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్యార్థుల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో చారిత్రక, పౌరాణిక అంశాలలో నైపుణ్యాలు పెంచు కోవడానికి కొన్ని గేమింగ్‌ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని పిల్లలు చూడరు. తల్లిదండ్రులకు అది చూపించేంత సమయం లేదు. అంతే కాదు! పిల్లల మానసిక శక్తి సామర్థ్యాలు పెంచే ఆటలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆడరు, అలాంటి వాటిని ఈ సమాజం ఎన్నడో మర్చిపోయి కాలగర్భంలో కలిపేశారు. చూడాలి ముందు ముందు ఎన్ని వైపరీత్యాలు ఎదురావుతాయో…!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top