ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు…. నిజం కాదు సుమా !?
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….
అసలు ఏమి జరిగింది అంటే…?*
క్యాపిటల్ వాయిస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు :- ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జి చేశారు. ఆ తరువాత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యానన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఉరుము లేని పిడుగులాగా ఒంగోలులో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణమేంటంటే.. కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానీకం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
సినీ ఫక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు అల్లరిమూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తరువాత ఔరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయపార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్‌లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాలపాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో 20 నిమిషాలపాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
కౌంటిగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్‌లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ప్రకాశంజిల్లా ఎస్పి గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో, ఆ తరువాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
Leave a Reply