చిలకలూరిపేట జమిందారుల చరిత్ర తెలుసుకుందాం…!!
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- నాటి చరిత్ర పునాదులపై వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంతాన్ని అధ్యాయనం చేయాలన్న ,అక్కడి ప్రజలు, భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలన్నా చరిత్రే మూలాధారం. చిలకలూరిపేటకు ఎంతో చరిత్ర ఉంది. చరిత్రను వెలికి తీసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఈ క్రమంలోనే చిలకలూరిపేట జమిందారుల చరిత్రను తెలుసుకుందాం.
రాజులు, జమీందారులు అంటే ప్రజలను పీడించి పన్నులు వసూలు చేస్తారన్న భావనకు వారు విరుద్ధం. మానవత్వం, దాతృత్వం, భక్తి పరాయణత్వం వారికి సొంతం. చిలకలూరిపేట ప్రాంతానికి శతాబ్దానికి పైగా జమీందారులుగా వ్యవహరించిన మానూరి వంశీకులు నిరాడంబరత్వానికి ప్రతీకగా నిలుస్తారు. చిలకలూరిపేటకు తొలినాళ్ళలో చిలకలూరిపాడుగా పేరుండేది. ఈ ప్రాంతానికి తొలి, మలి జమీందారులుగా వ్యవహరించిన ఘనత మానూరి వంశీయులకు దక్కుతుంది. పూర్వం ప్రస్తుత రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెదకోట, చినకోటలు ఉండేవి. కాలక్రమంలో చినకోట స్థానంలో ఓ ఆసుపత్రి నిర్మితంకాగా, పెదకోట శిధిలమైపోయి ప్రస్తుతం కొన్ని ఆనవాళ్ళు మాత్రమే మిగిలిఉన్నాయి. వీరు మధ్వ బ్రాహ్మణులు. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం నుంచి వచ్చినట్లు ఈ వంశీకులు తెలుపుతారు. మానూరి వంశీయులు ఈ ప్రాంతానికి జమీందారులుగా పరిపాలన కొనసాగించటంతో మానూరికి ముందు రాజా చేరి రాజామానూరి వంశంగా గుర్తింపు పొందారు. వీరిలో మొగలాయి చక్రవర్తుల నుంచి అధికారం పొంది మూర్తీజానగర్ (ప్రస్తుతం కొండవీడు) జమీందారుగా వీరి మూలపురుషుడు రాజా మానూరి కొండలరావు నియమించబడ్డాడు. ఆయన తొలిభార్యకు వెంకన్నారావు, నరసన్నరావు ఇద్దరు కుమారులు కాగా, రెండో భార్యకు అప్పాజీరావు, అక్కప్పారావులు సంతానం. 1707వ సంవత్సరంలో మొగలాయిల సామంతులైన ఆసఫ్‌జాయి వంశీయులచే అధికారం పొంది చిలకలూరిపాడుకు సర్దేశపాండ్యగా వెంకన్నారావు నియమితులయ్యాడు. 160 గ్రామాలతో చిలకలూరిపాడు జమీందారీ ఏర్పడింది. వెంకన్నారావు తర్వాత కొంతకాలం సవతి తమ్ముడైన అప్పాజీరావు అధికారం చేశాడు. తరువాత వారి వంశీయులు వెంకట్రావు, వెంకటకృష్ణమ్మరావు, వెంకటేశం అధికారం చలాయించారు. ఇంగ్లీష్ వారి దండయాత్రలో 1788లో మీర్ అలీఖాన్ హయాంలో గుంటూరు జిల్లా బ్రిటీష్ పరిపాలన క్రిందకు వెళ్ళింది. 1779లో జమీను రెండు భాగాలుగా చేశారు. అప్పటి వరకూ చిలకలూరిపేటలో కలిసి ఉన్న సత్తెనపల్లి పరగణ విడిపోయింది. మానూరి మూలపురుషుడు కొండలరావు తొలిభార్య సంతతికి చెందిన నరసన్నరావుకు చిలకలూరిపేట జమీ 79 గ్రామాలతో దక్కింది. రెండో భార్య సంతతికి చెందిన వెంకటేశంకు సత్తెనపల్లి లభించాయి. 1809లో నరసన్నరావు మృతి చెందటంతో తరువాత వెంకటకృష్ణమ్మ, వెంకటనరశింహారావు, వెంకన్నరావు అధికారం చేపట్టారు. వెంకన్నరావు 1840లో మృతి చెందారు. .1836లో ఆంగ్లేయులు జమీన్ దారీ పద్దతి రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 1845లో జమీనను స్వాధీనం చేసుకుని జమీన్దారులకు మనోవర్తి ఏర్పాటు చేశారు. దీంతో అధికారికంగా ఆఖరే జమీన్దారుగా వెంకన్నరావును భావించవచ్చు. ఆయన అనంతరం ఆయన దత్తపుత్రుడు వెంకటకృష్ణనరశింహారావుకు 300 రూపాయల మనోవర్తి మాత్రమే లభించింది. శ్రీభూనీలారాజ్యలక్ష్మి సమేత నృశింహస్వామి దేవస్థానం, పెద్దరధం, రధశాల, చంఘీజ్ ఖాన్ పేటలో వెన్నముద్ద వేణుగోపాలస్వామి ఆలయం, పుట్టకోటలోని బొల్లుమోరా వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటూ పలు ఆలయాలు నిర్మితమయ్యాయి. (సమాచార సేకరణ నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే)