అంతా జనార్ధనుడు చూసుకుంటాడు……..!?
# టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన అధికారులతో సహా అదే మాట
క్యాపిటల్ వాయిస్, అనకాపల్లి:- అనకాపల్లి లో అన్ని నిర్మాణాలకు సంబంధించి అంతా టౌన్ ప్లానింగ్ అధికారి జనార్ధనే చూసుకుంటారని బాహాటంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. స్థానిక అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పూడిమడక రోడ్లో రామాలయానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ పక్కన పంట కాలువపై అక్రమంగా ప్రధాన రహదారికి ఆనుకొని ప్రజలందరూ చూస్తుండగా జి ప్లస్ టు నిర్మాణం జరుగుతుంది. అసలు టౌన్ ప్లానింగ్ అధికారులు పంట కాలువపై నిర్మాణానికి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? అని స్థానికులు వాపోతున్నారు. అధికారం ఉండి అధికారులకి డబ్బులు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా భవనం నిర్మాణం చేసేసుకోవచ్చా? అని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనకాపల్లిలో కోకొల్లులుగా సాగుతున్నాయి సెట్ బ్యాక్ లు లేకుండా కూడా నిర్మాణాలు సాగుతున్నాయి, ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ అమలు చేయడం లేదు, కొన్నింటికైతే ప్లాన్లు కూడా లేకుండా నిర్మాణాలు సాగడం విశేషం. టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలు కుమ్మక్కై ఈ వ్యవహారాలు చేస్తున్నారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎంత మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడానికి కారణం వారి పర్సంటేజ్ వారి జేబుల్లోకి వెళ్లడమే కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు సమయం కావడం వల్ల కోడు నెపం చూపించుకుని ఫిర్యాదులు వచ్చిన వాటిని పక్కన పడేస్తున్నారు. ఎలక్షన్ బిజీలో ఉన్నామని తర్వాత చూస్తామని కాలయాపన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల మీద పై అధికారుల్ని అడిగితే ,అంతా స్వామి జనార్ధనుడే చూసుకుంటాడని చెబుతున్నారు ఇక్కడ జనార్ధనుడు మాటే వేదవాక్కు. కొంతమంది జీవీఎంసీ అనకాపల్లి జోన్ అధికారులను సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ వ్యవహారంపై అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ లేదా జీవీఎంసీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మరి జీవీఎంసీ జోనల్ కమిషనర్ లేదా జీవీఎంసీ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా? లేదా ఎన్నికల కోడ్ నెపంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తారా? వేచి చూడాల్సిందే.
Leave a Reply