ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించాలా …. !!

ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించాలా …. !!
క్యాపిటల్ వాయిస్, వినియోగ సమాచారం :- మనలో ఎంత మందికి తెలుసు.. మనం కొనుగోలు చేసిన ఖాళీ స్థలాల మీద ప్రభుత్వం పన్ను విధిస్తుంది అని. ఖాళీ స్థలాల మీద ప్రభుత్వం విధించే పన్నును ఖాళీ స్థలాల పన్ను(వేకెంట్ ల్యాండ్ టాక్స్) అని అంటారు. ఆస్తిపన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) కూడా అందరూ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన భూమిలో ఇంటి నిర్మాణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా స్థలాన్ని ఎల్ ఆర్ థిస్  (లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం ) కింద క్రమబద్ధీకరించుకునే సమయంలో.. వీఎల్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనేగాక, ఇతర మున్సిపాలిటీ ప్రాంతాలకూ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ గురుంచి పూర్తి వివరాలు
జీహెచ్‌ఎంసీ చట్టంలో వీఎల్‌టీ గురుంచి రెండు రకాలుగా ఉంది. సెక్షన్‌ 199 ప్రకారం.. పూర్తిస్థాయిలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములకు, మార్కెట్‌ విలువలో 0.05శాతం వీఎల్‌టీ విధిస్తారు. సెక్షన్‌ 212 ప్రకారం.. నిర్మాణానికి అనుమతించిన స్థలం మార్కెట్‌ విలువలో 0.5శాతం వీఎల్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1, 2022 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. అప్పటి నుంచి ఆస్తిపన్ను మదింపు, పీటీఐఎన్‌ నంబరు, ఇంటి నంబరు జారీ ఇక్కడే జరుగుతోంది. అలాగే, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌ సమయంలో వీఎల్‌టీకి వీటీఐఎన్‌ నంబరు, ఇంటి నంబరు కూడా జారీ అవుతున్నాయి.వీటీఐఎన్‌ పొందిన యజమానులు.. ఏటా వారి వీఎల్‌టీని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదా మీసేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో ఈ పన్ను చెల్లించవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 30 శాతం మంది యజమానులు క్రమం తప్పకుండా జీహెచ్‌ఎంసీకి వీఎల్‌టీని చెల్లిస్తున్నారు.ఏప్రిల్‌ 1, 2022 తేదీ తర్వాత రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలాలకు అప్పటికే వీఎల్‌టీ ఉంటుంది. అలాంటి భూమిలో నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే.. వీఎల్‌టీ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది.

2022 ముందు కొన్న భూములపై వీఎల్‌టీ ఛార్జీలు చెల్లించాలా?
ఏప్రిల్‌ 1, 2022కు ముందు రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలాలకు సంబంధిత సర్కిల్‌ ఉపకమిషనర్‌ ఆధ్వర్యంలో వీఎల్‌టీ విధిస్తారు. సదరు యజమాని తనే దరఖాస్తు చేసుకున్నప్పుడు.. సంబంధిత అధికారులు ఆ పత్రాలను పరిశీలించి వీఎల్‌టీ నంబరు జనరేట్‌ చేసి, గరిష్ఠంగా మూడేళ్ల పన్ను విధించే అవకాశం ఉంది.
సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదించిన కొనుగోలు ఒప్పంద పత్రం(సేల్ డీడ్) గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన లింకు డాక్యుమెంట్లు, ఎల్ ఆర్ ఎస్ క్రమబద్ధీకరణ పత్రం లేదా ఇతర, ఈసీ, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌లతో బల్దియా సర్కిల్‌ ఆఫీసును సంప్రదిస్తే.. సంబంధిత బిల్ కలెక్టర్  లేదా టాక్స్  ఇన్స్పెక్టర్ ఆయా పత్రాలను పరిశీలించి దరఖాస్తును ఉపకమిషనర్‌కు పంపిస్తారు.తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019లోని 94(ఏ) సెక్షన్‌ ప్రకారం.. నిర్మాణాలకు అనువైన లేదా నిర్మాణాలు అనుమతించదగిన స్థలాలపై వీఎల్‌టీ ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆ మేరకు ఖాళీ స్థలాలకు అనుమతి ఇచ్చే సమయంలో పన్ను విధిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top