టర్కీ కోళ్ల పెంపకం లో  తీసుకోవలసిన జాగ్రత్తలు…  !!

టర్కీ కోళ్ల పెంపకం లో  తీసుకోవలసిన జాగ్రత్తలు…  !!

క్యాపిటల్ వాయిస్, పశు సమాచారం :- టర్కీ కోళ్ల పెంపకానికి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా టర్కీ కోళ్ల పెంపకం నెమ్మదిగా పుంజుకుంటోంది. కొవ్వు తక్కువగా ఉండే మాంసానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఈ కోళ్ల మాంసానికి భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టర్కీ కోళ్ల మాంసం ఇతర పౌల్ట్రీ జాతుల మాంసం లో ఉండే కొవ్వు కంటే తక్కువ కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. టర్కీ కోళ్లను మాంసం, గుడ్ల కోసం పెంచవచ్చు. విదేశీ టర్కీ రకాలైన బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్, బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్, బెల్ట్స్ విల్లే స్మాల్ వైట్ రకాలను ప్రస్తుతం మనదేశంలో వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ బ్లాక్ దేశీరకం, బెల్ట్స్ విల్లే స్మాల్ వైట్ రకాన్ని సంకరం చేసి నందనం టర్కీ అనే రకాన్ని అభివృద్ధి చేసింది.
టర్కీ కోళ్ల రకాలు – ప్రత్యేకతలు
> బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ రకానికి చెందిన టర్కీ కోళ్ల ఈకలు నలుపు రంగులో ఉండి తోక చివరి భాగంలో మాత్రం తెల్ల రంగులో ఉంటాయి.
> బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్ రకం.. బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్, వైట్ హాలండ్ టర్కీల మధ్య సంకరం. ఈ తెలుపు రంగు టర్కీలు భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోగలవు. డ్రెస్సింగ్ తర్వాత శుభ్రంగా కనిపిస్తాయి.
> బెల్టస్విల్లే స్మాల్ వైట్ రకం టర్కీ కోళ్లకు గుడ్ల ఉత్పత్తి, గుడ్డు పొదిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
పెంపకం
టర్కీ కోళ్లను ఫ్రీ రేంజ్ (లేదా) ఇంటెన్సివ్ సిస్టమ్ కింద పెంచవచ్చు. ఫ్రీ రేంజ్ సిస్టమ్ లో ఒక ఎకరం కంచె భూమిలో 200 నుంచి 250 టర్కీలను పెంచవచ్చు. ఒక కోడికి 3 నుంచి 4 చదరపు అడుగుల చొప్పున నైట్ షెల్టర్ నిర్మించాలి. నీడ, చల్లని వాతావరణం కోసం చెట్లను నాటడం మంచిది. టర్కీ కోళ్ల షెడ్ నేల కాంక్రీటుతో నిర్మించాలి. షెడ్ వెడల్పు 9 మీటర్లకు మించకూడదు. టర్కీ కోళ్లకు దాణా ఇతర కోళ్లతో పోలిస్తే టర్కీ కోళ్లకు పోషకావసరాలు ఎక్కువ. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల వీటి కోసం మార్కెట్లో రెడీమేడ్ ఫీడ్ అందుబాటులో లేదు. బాయిలర్ స్టార్టర్ ఫీడ్ ను  కొనుగోలు చేసి దానిలో మాంసకృత్తుల శాతం పెంచడానికి సోయా బీన్ మీల్ వంటివి అదనంగా జోడించవచ్చు. ఒక్కో కోడికి 6 నెలల వయసు వరకు సగటున 20 నుంచి 25 కిలోల మేత అవసరం. శుభ్రమైన నీటిని అందించాలి. వేసవిలో ఎక్కువగా నీటిని అందుబాటులో ఉంచాలి. వేసవిలో చల్లగా ఉండే సమయంలో ఆహారం ఇవ్వాలి.

మాంసం, గుడ్ల ఉత్పత్తి
సాధారణంగా టర్కీ కోళ్లను ఆరు నెలల వయసులో మాంసం కోసం విక్రయిస్తారు. అప్పుడు కోడి సగటు శరీర బరువు 6 నుంచి 8 కిలోలు ఉంటుంది. 30వ వారం నుంచి ఈ కోళ్లు గుడ్లు పెడతాయి. ఏడాదికి 60 నుంచి 100 గుడ్లు పెడతాయి. సంతానోత్పత్తి ప్రయోజనం కోసం పెంచేటప్పుడు మగ, ఆడ టర్కీ కోళ్ల నిష్పత్తి 1:5గా ఉండాలి. టర్కీ కోళ్ల మాంసం ధర, లాభం అనేది మార్కెట్లో డిమాండ్ బట్టి ఉంటుంది. వీటిని పెంచాలనుకుంటే ముందుగా స్థానిక వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top