మూడు కొండల సముదాయం….మన పాపికొండలు

మూడు కొండల సముదాయం….మన పాపికొండలు

# ఆంధ్రా కాశ్మీరం పేరుతో పాపికొండలు

# రాజమండ్రి అయినా.. భద్రాచలం అయినా పాపికొండలు చేరడానికి 60 కిమీలు 

క్యాపిటల్ వాయిస్, యాత్రా సమాచారం :-పాపికొండలు.! ఈ పేరు వినగానే మనసుకి ఒకరకమైన హాయి కలుగుతుంది. మరి స్వయంగా ఈ పర్వత శ్రేణిని దర్శిస్తే ఇంకెంత సుందరభరితంగా ఉంటుందో మీరే ఆలోచించండి.! ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న “పాపికొండలు” విశిష్టత గురించి చదివేద్దాం రండి….పాపికొండలు అసలైన పేరు ‘పాపిడి కొండలు’. వేరు చేయడాన్ని తెలుగులో పాపిడి అనే పదంతో సంభోదిస్తారు. అందుకే గోదావరి పాయలను వేరు చేసే ఈ ప్రదేశాన్ని పాపిడి కొండలుగా పిలిచేవారు. రామాయణంలో సీతారాములు తమ అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చెబుతారు. రాజమండ్రి నుంచి పాపికొండలకు బోట్ లో చేరుకోవడం ఓ మరపురాని అనుభవం రాజమండ్రి నుంచి 60 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 180 కిలోమీటర్లు, పోలవరం నుంచి 20 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 260 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 410 కిలోమీటర్ల దూరంలో పాపికొండలు ఉన్నాయి. గోదావరి నదితో పెనవేసుకున్నట్లు కనిపించే పాపికొండల అందాలు టూరిస్టులు మైమరపింపజేస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నదిలో విస్తరించిన మూడు కొండల సముదాయం పాపికొండలు. దట్టమైన అడవుల మధ్య పరిరక్షింపబడుతున్న జాతీయ పార్కుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పాపికొండలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉన్నాయి.

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం.పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

నిజంగా చారిత్రాత్మక ప్రదేశం..

పశ్చిమగోదావరి జిల్లాలోని పేరంటాళ్లపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. ఇక్కడ శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫల వృక్షాలు, పూల మొక్కలు కనిపిస్తాయి. అమాయక కొండరెడ్ల (గిరిజనులు) అప్యాయత, వారు చూపించే ఆదరణ నవ నాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ “శ్రీరాముని వాకిటం” అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాళ్లపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జాలువారే జలపాతం కనిపిస్తుంది. చుట్టూ పనస, పోక చెక్క వంటి అనేక మొక్కలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భద్రాచలం నుంచి పాపికొండల యాత్ర చేసే యాత్రికులు తూర్పు గోదావరి జిల్లా శ్రీరామగిరి గ్రామంలోని శ్రీరామగిరి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. ఎతైన కొండలు, గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కళ్లు పరవశింపజేసేలా సుమారు 500 సంవత్సరాల కిందట మాతంగి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీసీతారామ లక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తూ ఉంటారు. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కను విందు చేస్తాయి. ఈ కొండల నుంచి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటాయువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీ రాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేశాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

నది మార్గం…..

రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.

భద్రాచలం నుండి తూర్పుగోదావరి జిల్లా లోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరవచ్చు.ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పాపికొండల పర్యాటకం విహారయాత్రలకు 2021 జూలై 1 నాడు, 2019 సెప్టెంబరులో దుర్ఘటన జరిగిన 21 నెలల తర్వాత మరల అనుమతించింది.

రహదారి మార్గం…… 

పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పోలవరం వద్ద కట్టుతున్న ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.

రైలు మార్గం : దగ్గరి రైల్వే స్టేషన్ రాజమండ్రిలో ఉంది.

వాయుమార్గం : దగ్గరి విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *