
కాలుష్య కోరల్లో గాలి, నీరు….నియంత్రణ ఎక్కడ – లయన్ అన్నెం కోటిరెడ్డి
# ప్రపంచ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి ఆందోళన
క్యాపిటల్ వాయిస్, హైదరాబాద్ :-ప్రకృతి మనకు అందించిన గాలి, నీరు, నేలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ప్రతి తరానికి బాధ్యత అయినా… మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల పర్యావరణం రోజురోజుకూ దెబ్బతింటోందని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గతంలో పట్టణాల పరిధికి చాలా దూరంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు, పట్టణాభివృద్ధి పేరుతో నేడు నగరాల మధ్యలోకి చేరిపోయి భారీగా కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు, వాహనాల నుంచి వస్తున్న విష వాయువులు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతున్నాయని కోటిరెడ్డి అన్నారు.“ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కానీ కొద్ది సంవత్సరాల్లో ఇది మరింత ప్రమాదకర దశకు వెళ్లే అవకాశముంది. ప్రజలు అస్వస్థతతో, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి చేరుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యధికంగా ప్రభావితం అవుతారు” అని ఆయన హెచ్చరించారు.పట్టణాల్లో పెరుగుతున్న నిర్మాణాలు, వనరుల దుర్వినియోగం, పచ్చదనాన్ని నాశనం చేస్తూ జరుగుతున్న అర్బన్ డెవలప్మెంట్ అన్ని కలిసి కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారాయని కోటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోటిరెడ్డి పిలుపునిచ్చారు. పరిశ్రమలకు కఠిన నిబంధనలు, చెట్ల నరికివేతపై కట్టడి, కాలుష్య నియంత్రణ పరికరాల అమలు, పట్టణాల్లో పచ్చదనం పెంపు వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని కోరారు.ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. “ప్రకృతిని కాపాడటం అంటే మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును కాపాడటం” అని కోటిరెడ్డి అన్నారు.ప్రపంచ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా అందరూ పర్యావరణహిత చర్యల వైపు అడుగులు వేయాలని, పచ్చదనం పెంపుకు ప్రోత్సహించాలని సమితి సూచించింది.
