సివిల్స్ ఇంటర్వ్యూ ను ఎదుర్కోవడం ఎలా… !!

సివిల్స్ ఇంటర్వ్యూ ను ఎదుర్కోవడం ఎలా… !!
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థుల సందేహాలు, సమాధానాలు సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్లో అడిగే ప్రశ్నల గురించి అనేక అపోహలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇవి ఎక్కువయ్యాయి. ఇక్కడ అభ్యర్థి, వారి పేరెంట్స్ మదిలో తలెత్తే కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాము. 
1) ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థిలో ఎలాంటి లక్షణాలను చూస్తుంది…!!
 ప్రస్తుత కాలంలో ఒక సివిల్ సర్వెంట్ కు అవసరమైన లక్షణాలనే ఇంటర్వ్యూ బోర్డు చూస్తుంది. కొన్ని లక్షణాలు ప్రతి దేశంలో సివిల్ సర్వెంట్లకు ఒకే విధంగా అవసరమైనప్పటికీ, మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొన్ని లక్షణాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ క్రింది లక్షణాలను పరిశీలిస్తున్నారు. సామాజిక ఐక్యతను సాధించే సామర్థ్యం – నాయకత్వం, సివిల్ సర్వీసెస్ కు సరిపోయే యోగ్యత, మానసిక చురుకుదనం, విశ్లేషణాత్మక తార్కికం, విషయాలను గ్రహించే నైపుణ్యం, సమతుల్య తీర్పు, వివిధ అంశాలపై ఆసక్తి, దానిలో లోతైన పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, మేధో, నైతిక సమగ్రత.
2) మెయిన్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు బోర్డుకు తెలుస్తాయా? 
రాత పరీక్ష ఫలితాలు ప్రచురించిన వెంటనే, అభ్యర్థులు సాధించిన మార్కులను యుపిఎస్సి  యొక్క రహస్య విభాగం లో ఉంచుతారు. వాటిని ఎవరూ చూడలేరు. బోర్డుకు మార్కుల గురించి ఎలాంటి సమాచారం ఉండదు. అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడానికి ముందే బోర్డు ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరుచుకోకుండా ఉండేందుకే ఈ గోప్యతను పాటిస్తారు.
3) మీ దరఖాస్తులో రాష్ట్రాల ప్రాధాన్యతలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని ఎందుకు ఇష్టపడ్డారు. మరొకదాన్ని ఎందుకు ఇష్టపడలేదు అనే దానిపై ప్రశ్నలు ఉంటాయా? రాష్ట్రాల ప్రాధాన్యతలకు సంబంధించిన వివరాలు బోర్డుకు తెలియవు. ఎందుకంటే ఇది కూడా పక్షపాతానికి దారితీస్తుంది.
4) సివిల్ సర్వీసెస్ వ్యవస్థలో ప్రభావాలు, సిఫార్సులు పనిచేస్తాయా?
పనిచేయవు. ఏ అభ్యర్థి ఏ బోర్డుకు వెళతాడో అనే విషయం అభ్యర్థులకు గానీ, చైర్పర్సన్లకు గానీ, బోర్డు సలహాదారులకు గానీ తెలియదు. నిజానికి, యుపిఎస్సి  చైర్మన్ ప్రతిరోజూ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే ముందు, అభ్యర్థుల ప్రొఫైల్స్ ఉన్న సీల్డ్ ప్యాకెట్ల కవర్పై యాదృచ్ఛికంగా బోర్డు నంబర్ ను సూచిస్తారు. ఉదయం సెషన్కు ఒకసారి, మధ్యాహ్నం సెషన్కు మరోసారి ఇలా చేస్తారు. ఇలాంటి వ్యవస్థలో ప్రభావాలు, సిఫార్సులు పనిచేయడం చాలా కష్టం.
5) ఇంటర్వ్యూకి సభ్యులు మార్కులను ఎలా కేటాయిస్తారు?
బోర్డులోని సభ్యులు అభ్యర్థుల యొక్క మేధో, వ్యక్తిగత లక్షణాలను, వారి మొత్తం పనితీరును వ్యక్తిగతంగా అంచనా వేస్తారు. సభ్యులు వ్యక్తిగత అంచనాలపై చర్చించిన తర్వాత బోర్డు తుది మూల్యాంకనం ఆధారంగా మార్కులు కేటాయిస్తుంది.
6) అభ్యర్థులకు 189, 163 వంటి బేసి సంఖ్యలలో మార్కులు రావడం కనిపిస్తుంది. ఇంత కచ్చితత్వంతో మార్కులు కేటాయించడం ఎలా సాధ్యం? మార్కులు ఎలా నిర్ణయిస్తారు?
సభ్యులు సాధారణంగా ఐదు పాయింట్ల స్కేల్ ద్వారా మార్కులు . 0-0 (Outstanding), V-Very Good, G-Good,I-Improvement Needed, U-Unsatisfactory.
7) ఇంటర్వ్యూలో ఏవైనా కనీస అర్హత మార్కులు ఉన్నాయా?
పర్సనాలిటీ టెస్ట్లో కనీస అర్హత మార్కులు లేవు.
8) యూట్యూబ్ లో మనం చూడగలిగే ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి. అవి యూపీఎస్సీ నిర్వహించే అసలైన ఇంటర్వ్యూలేనా?
కాదు. చాలా మంది అభ్యర్థులు యూట్యూబ్ లో చూసేవి యూపీఎస్సీ నిర్వహించే అసలైన ఇంటర్వ్యూలు అని తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. అవి నిజమైనవి కావు. యూపీఎస్సీ  ఏ ఇంటర్వ్యూను రికార్డ్ చేయడానికి అనుమతించదు. అవన్నీ కోచింగ్ సంస్థలు నిర్వహించి, అప్లోడ్ చేసిన మాక్ ఇంటర్వ్యూలు.
9) సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో అడిగినట్లుగా చెప్పబడుతున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత, మతపరమైన ప్రశ్నలు అడుగుతారా?
యూపీఎస్సీ  ఇంటర్వ్యూ అనేది ఒక గంభీరమైన ప్రభుత్వ ఇంటర్వ్యూ. ప్రభుత్వం యొక్క ప్రతి కదలికను ప్రశ్నించగల ప్రజాస్వామ్య దేశంలో, బోర్డు సభ్యులు ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అభ్యర్థుల వ్యక్తిగత, మతపరమైన, ఇతర మనోభావాలను దెబ్బతీసే ప్రశ్నలను ఎప్పుడూ అడగరు.
10) ఇంటర్వ్యూ లో ఎన్ని మార్కులు లక్ష్యంగా పెట్టుకోవచ్చు?
గత సంవత్సరాల ఇంటర్వ్యూలలో అభ్యర్థులు సాధించిన మార్కుల విశ్లేషణ ప్రకారం, మెజార్టీ అభ్యర్థులు 275 మార్కులకుగాను 150 నుండి 180 మార్కుల శ్రేణిలో ఉన్నారు. కాబట్టి, మంచి సన్నద్ధతతో కనీసం 165 మార్కులు ఇస్తుంది. సరైన మార్గదర్శకత్వం తో కూడిన సన్నద్ధత మీకు 180 నుండి 199 వరకు ఇస్తుంది. 200 కంటే ఎక్కువ రావడం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top