భారత్‌తో దౌత్య సంబంధాలు మరింత దిగజారేలా కెనడా వ్యవహారం కొనసాగుతోంది. ఆ దేశ మంత్రి ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసంబంధ ఆరోపణలు చేశారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అంతేగాక, కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనుక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన అమిత్ షా పేరును ప్రస్తావించడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవి అసంబద్ధమైనవని, నిరాధారమైనవని భారత్ కొట్టిపారేసింది. ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఇటీవల ఒట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, వాటిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు.